ప్లీన‌రీ అన్న‌ది  పార్టీ పండుగ. ఎవ్వ‌రూ కాద‌నరు. మాట్లాడుకోవాల్సినంత మాట్లాడుకున్నాక పార్టీకి దిశా నిర్దేశం చేసే నాయ‌కులు కొన్ని విష‌యాలు చెప్పి త‌మ శ్రేణుల‌ను క్షేత్ర స్థాయికి పంపిస్తారు. ఇలాంటి వేడుక‌ల‌కు హ‌ద్దు దాటి ఖ‌ర్చు చేయ‌డం వెనుక ఉద్దేశం ఏమ‌యి ఉంటుంది. గులాబీ పార్టీకి కార్పొరేట్ రాజ‌కీయాలు చేయ‌డంలోనూ, ఆ త‌ర‌హా ఏర్పాట్లు చేయ‌డంలోనూ ఇప్ప‌టికే ముందుంది దానికి కొన‌సాగింపే ఈ స‌భ అని చెప్ప‌ద‌ల్చుకుందా? ఖ‌రీద‌యిన వేడుక‌ల కార‌ణంగా సాధించింది గ‌తంలోనూ ఏమీ లేదు. జూమ్ మీటింగులోనూ ఆ పాటి మాట‌లు చెప్ప‌వ‌చ్చు.

త‌మ స‌త్తానో స‌మ‌ర్థ‌త‌నో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం వైపు చూపిస్తే బాగుంటుంది కానీ ఇలాంటి మీటింగుల నిర్వ‌హ‌ణ‌తో వచ్చే పేరు నాయ‌కుల్లోనూ, ప్ర‌జ‌ల్లోనూ ఎంతోకాలం నిల‌వ‌దు. పార్టీలు మ‌హా నాడు పేరిటో ప్లీన‌రీల పేరిట హ‌ద్దు దాటి ఖ‌ర్చు చేయ‌డం వెనుక ఒక స్ట్రాట‌జీ ఉంటుంది. అవి ఎన్నిక‌ల ముందు జ‌రిగితే కొంచెం ఎక్కువ డ‌బ్బుతో హోదానో ప‌రప‌తినో చాటుకునే హంగామా కావ‌డం ఇప్ప‌టిదాకా ఉన్న‌దే! ఎందుకు ఇవన్నీ? ఇవి లేని రోజు కూడా ప్లీన‌రీలు జ‌రిగాయి. త‌రువాత కార్య‌క‌ర్త‌ల చొర‌వ‌తో ఓట్లు రాలాయి.  ఇవ‌న్నీ వ‌ద్ద‌నుకుంటే ఏం జ‌ర‌గ‌బోతోంది? ఒక పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి జ‌రిగే ఎన్నిక‌కు ఇంత ఖ‌ర్చు చేసి ఏం సాధిస్తారు? యువ‌రాజు కేటీఆర్ ఎన్నిక లాంఛ‌న‌మే అని అనుకుందాం కాసేపు.. ఆ పాటి సంస్థాగ‌త నిర్ణ‌యానికి ఇంత ఖర్చు దేనికి స‌ర్!


ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన పార్టీ ఇంటి పార్టీ టీఆర్ఎస్. ఆ రోజు ఉద్య‌మ కాంక్ష నుంచి మ‌రింత బ‌లోపేతం అయిన పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీనే! అలాంటి పార్టీ ప్ర‌జ‌ల నుంచి ప్ర‌జ‌ల వ‌ర‌కూ ఎదిగిన పార్టీ ఇప్పుడు కార్పొరేట్ స్టైల్ లో ప్లీన‌రీ లు నిర్వ‌హించ‌డం ఎందుక‌ని?
అవును! ఇది ముమ్మూటికీ త‌ప్పే! ప్ర‌జ‌ల మ‌ధ్యకు పోతేనే ఏమ‌యినా తెలుస్తాయి. ఒక‌వేళ ఇంట‌ర్న‌ల్ మీటింగ్ అయినా ఇంత హంగామా అవ‌స‌రం లేదు కూడా! ప్లీన‌రీ కోసం ఐడెంటిటీ కార్డులు, ప‌రిమిత సంఖ్య‌లో పిలుపులు, ఆ త‌రువాత ఫొటో సెష‌న్లు ఇవ‌న్నీ చేశాక వీళ్లు సాధించేదేంటి? ఎలానూ ఎన్నిక‌ల వేళ  చేయాల్సిన త‌ప్పులేవో చేస్తూనే ఉన్నారు క‌దా! ఇప్పుడు ప్లీన‌రీకి ఇంత ఖ‌ర్చు ఎందుకు? ఎందుకంటే ఇది ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చే పార్టీ పండుగ కనుక. పార్టీ నాయ‌కుల‌కు కాస్త హై క్లాస్ హ‌డావుడి చూపించి ఆ త‌రువాత ఇదే ఉత్సాహంతో ప‌నిచేయించాల‌న్న త‌ప‌న క‌నుక. పార్టీలు ఏం ఆలోచించినా ఇంత‌టి ఖ‌రీదు ప‌నులు మానుకుని, ఆ డ‌బ్బును అవ‌స్థ‌ల్లో ఉన్న కార్య‌క‌ర్త‌ల‌కు కేటాయిస్తే ఎంత బాగుంటుందో అన్న‌ది ఇంకొంద‌రి ప్ర‌తిపాద‌న.


ఖ‌రీద‌యిన హోట‌ళ్ల‌లో ప్లీన‌రీలు పెట్ట‌డం ఎందుకు అన్న ప్ర‌శ్న ఒక‌టి వినిపిస్తోంది. ష‌ర్మిల లాంటి కార్పొరేట్ పార్టీ జేఆర్సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ను, టీఆర్ఎస్ లాంటి ఉద్య‌మ పార్టీ హైటెక్స్ ను ఎందుకు ఎంచుకుంటున్నాయి. వీటివ‌ల్ల వ‌చ్చే లాభం ఎంత‌? క‌రోనా భ‌యం కార‌ణంగానే ఇవ‌న్నీ చేస్తున్నాం అని మాత్రం చెప్పొద్దు. ఇంత‌టి ఖ‌రీద‌యిన వ్య‌వ‌హారాల కార‌ణంగా పార్టీలు ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేవు అని ఆలోచించ‌రా? లిమిటెడ్ ప‌బ్లిక్ కోస‌మే మేమింతా చేస్తున్నాం అంటే మేం విని ఊరుకోవాలా? ఇప్ప‌టికే బ‌హిరంగ స‌భ‌ల పేరిట‌, దీక్ష‌ల పేరిట నానా హంగామా చేస్తున్నారు కదా! చేయ‌క‌పోతే కాద‌నాలి. చేస్తూ కూడా మ‌ళ్లీ ఇలాంటి వెన్యూల‌ను ఎందుకు ఎంచుకుంటున్నార‌ని..ప్లీన‌రీ అంటే కార్పొరేట్ పండుగా ? ఏమో!

మరింత సమాచారం తెలుసుకోండి: