భారత్ కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ కు 30దేశాలు మ్యూచువల్ రికగ్నిషన్ ఇచ్చాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, నేపాల్, బెల్జియం తదితర దేశాలు భారత్ తో మ్యూచువల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇటీవల బ్రిటన్.. భారత్ జారీ చేసే సర్టిఫికేట్ కు గుర్తింపు ఇవ్వలేదు. దీంతో భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పలు దఫాల చర్చల తర్వాత ఈ నెల 11న బ్రిటన్.. భారత్ సర్టిఫికెట్ ను ఆమోదించింది.

మరోవైపు వ్యాక్సినేషన్ భారత్ లో జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఈ నెల 19 లేదా 20వ తేదీల్లో 100కోట్ల డోసుల్ని పూర్తి చేసుకొని చారిత్రక మైలురాయిని భారత్ చేరనుంది. దేశంలో అర్హులైన వారిలో 73శాతం మంది తొలి డోసు, 29శాతం మంది రెండు డోసులూ తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రాల దగ్గర 8కోట్ల డోసులకు పైగా వ్యాక్సిన్లు ఉన్నాయి. అటు భారత్ లో బూస్టర్ డోసుల వినియోగంపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇక దేశంలో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న తొలి జిల్లాగా హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నోర్ జిల్లా నిలిచింది. ఆ జిల్లాలో మొత్తం 60వేల 305మంది 18ఏళ్లకు పైబడిన వారున్నారు. వారందరికీ రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఇందులో హెల్త్ వర్కర్ల కృషి ఉందని.. వారు కొండకోనల్లో ఉన్న గ్రామాలకు కాలినడకన వెళ్లి అక్కడున్నవారికి వ్యాక్సిన్ వేశారని అధికారులు తెలిపారు.

వ్యాక్సిన్ విషయం అలా ఉంచితే.. రష్యాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దీంతో గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 984మంది మృతి చెందారు. కొత్తగా 28వేల 717మంది వైరస్ బారిన పడ్డారు. అయితే రష్యాలో కరోనా వెలుగు చూసినప్పటి నుంచి ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. వ్యాక్సినేషన్ నెమ్మదిగా జరగడం, కఠిన ఆంక్షలు విధించడంపై ప్రభుత్వం ఆసక్తి చూపించకపోవడంతో.. వైరస్ మళ్లీ వ్యాపిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.








మరింత సమాచారం తెలుసుకోండి: