సజ్జల రామకృష్ణారెడ్డి... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ టూ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరూ అంటే.... ఠక్కున చెప్పే పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. పేరుకే ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి. కానీ ప్రస్తుతం ఆయన పని మాత్రం అంతకు మించి అన్నట్లుగా సాగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో ఏ పని జరగాలన్నా సరే... ఆయన ఓ మాట చెబితే సరే. ఇంకా చెప్పాలంటే.... ప్రభుత్వ ఉద్యోగులతో ఆయన పేరు చెప్పినా చాలు... పని జరిగిపోతుంది. అంతటి పవర్ ఫుల్ నేతగా ఎదిగారు సజ్జల రామకృష్ణా రెడ్డి. వాస్తవానికి ఎన్నికలకు ముందు వరకు కూడా జగన్ తర్వాత స్థానం ఎవరిదంటే... అందరూ రెండు మూడు పేర్లు చెప్పేవారు. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి... ఇలా... కానీ ఇప్పుడు మాత్రం అంతా ముక్తకంఠంతో చెబుతున్న పేరు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లే బదులుగా... సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిస్తే చాలు... పని అయిపోయినట్లే.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవాలనుకునే వారు... ముందుగా సజ్జల అపాయింట్‌మెంట్ తీసుకుంటే చాలు... వారికి కావాల్సిన పని పూర్తవుతుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా ఇదే పరిస్థితి. మొదట్లో పార్టీ వ్యవహారాలకే పరిమితమైనట్లు కనిపించారు సజ్జల. కానీ... ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎంపీ విజయ సాయిరెడ్డి కేవలం విశాఖకే పరిమితం కావడంతో... రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలను చక్కదిద్దే పని సజ్జల తీసుకున్నారు. పార్టీకి అండగా ఉన్న పెద్దలతో పాటు.... కీలక నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న సజ్జల ప్రభుత్వంలో కూడా మెయిన్ లీడర్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఏ విషయం అయినా సరే... సజ్జల స్పందిస్తే సరిపోతుంది. చివరికి మంత్రులు కూడా ఆయా విషయాలపై మాట్లాడటం లేదు. ఇదే విషయం ఇప్పుడు పార్టీలో చాలా మంది నేతలకు ఇబ్బందిగా మారింది. కొంత మంది అయితే... అసలు సజ్జల ఎవరూ... ఆయనకు ఎందుకు చెప్పాలి... మేము కూడా పార్టీలో సీనియర్లమే కదా... ఆయన పార్టీలోకి ఎప్పుడు వచ్చారు... మాపై ఆయన పెత్తనం ఏమిటీ అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: