ఎవరేమనుకున్నా ఇది అచ్చమైన ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగం ఉంటుంది. దాని ప్రకారమే అందరూ నడచుకోవాలి. ఇక ప్రజలే ప్రభువులు. వారే అంతిమ నిర్ణేతలు అని ఎంత చెప్పుకున్నా కూడా వారికి అయిదేళ్లకు ఒకసారి మాత్రమే ఓటు అనే వజ్రాయుధం చేతిలో ఉంటుంది.

అపుడే వారు నేతాశ్రీల తలరాతలు మారుస్తారు. అలా ఉద్ధండులు అనుకున్న వారి జాతకాలు కూడా చాలా సార్లు జనాలు మార్చేశారు. అయితే జనాలకు మిగిలిన అయిదేళ్ల కాలంలో ఇండియన్ డెమోక్రసీ లో ఎలాంటి పాత్ర ఉండదు, ఇతర దేశాల్లో కొన్ని చోట్ల రీకాల్ అధికారం అయితే ప్రజలకు ఉంది కానీ ఈ దేశంలో తాము ఎన్నుకున్న నాయకుడు చెడ్డగా పాలించినా లేక హామీలు తీర్చకపోయినా లేక ఇబ్బంది కలిగించినా జనాలు ఏమీ చేయడానికి లేదు.

కానీ ఇపుడు ఏపీలో కొందరు నాయకులు మాత్రం జనాలు తిరగబడతారు అంటూ కొత్త ప్రచారం చేస్తున్నారు. బహుశా రాజకీయాల్లో మంచి పవర్ ఫుల్ గా ఉంటుంది అని వాడేస్తున్నారో ఏమో తెలియదు కానీ జనాలు తిరుగుబాటు చేస్తారు అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ మాట మొదట చంద్రబాబు అంటే ఆ తరువాత లోకేష్ నుంచి మాజీ మంత్రుల దాకా ఇంకా సీనియర్ నేతల వరకూ కూడా వాడేస్తున్నారు.

ఇపుడు చూస్తే ఇదే మాటను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా వాడుతున్నారు. ఆయన కూడా తెలుగుదేశం నేతల తీరు జనాలు చూస్తున్నారు. అన్ని పధకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. వారికి ప్రజలే బుద్ధి చెబుతారు అని హెచ్చరిస్తున్నారు. నిజానికి ప్రజలు తిరుగుబాటు ఎవరి మీద చేసినా అది శాంతియుతంగానే ఉంటుంది. ఓట్లతోనే వారు నేతలకు తగిన రీతిన బుద్ధి చెబుతారు. అంతే కానీ వీధుల్లోకి వచ్చి తిరుగుబాటు చేస్తారు అంటే అది జరిగేది కాదు. ఏదో నాయకులు క్యాడర్ కి ఉత్సాహం కలిగించడానికి, లేదా తమ పవర్ ఫుల్ డైలాగులు కొన్ని వదలడానికి ఇలా మాట్లాడుతారు అనే అనుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: