తెలంగాణలో మద్యం ఏరులై పారుతోంది. దసరాకు భారీగా మద్యం విక్రయించడంపై ఎక్సైజ్‌ శాఖ దృష్టి సారించింది. పండుగ సమయంలో రూ. 5 వేల కోట్లు విలువ జేసే మద్యాన్ని విక్రయించాలన్న టార్గెట్‌పై ఫోకస్‌ చేసింది. కరోనా కారణంగా రాష్ట్రంలో రెండేళ్లుగా మద్యం విక్రయాలు పడిపోయాయి. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. మందుబాబులు పూటుగా తాగేస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటిదాకా రూ.30 వేల కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోల్చి చూస్తే... 30 శాతం మద్యం అదనంగా అమ్మకాలు జరిగాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు కొత్త కళ వచ్చింది. ఇదే జోష్‌తో దసరాకు భారీగా విక్రయించాలని అబ్కారీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈనెల పండుగ రోజు, మరుసటి రోజున 5 వేల కోట్ల మద్యం విక్రయించడంలో నిమగ్నమైంది.

తెలంగాణలో సాధారణ రోజుల్లో మద్యం అమ్మకాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అదే పండుగ రోజుల్లో అయితే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే. తాజాగా దసరా పండగకు భారీగా మద్యాన్ని ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. గతేడాది దసరా పండుగకు రూ. 2,500 కోట్ల మద్యం విక్రయించగా.. ఈసారి రూ. 5 వేల కోట్లకు తగ్గకుండా అమ్మాలని సర్కారు లక్ష్యంగా పెట్టుంది. ప్రస్తుతం కరోనా చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో బార్లకు వెళ్లి మద్యం సేవించేవారి సంఖ్య గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే.. ఈసారి 30 శాతం వరకు మద్యం అమ్మకాలు పెరిగాయి. కరోనా తర్వాత బీర్ల విక్రయాలు తక్కువగా ఉన్నా.. సెప్టెంబర్‌ నుంచి అనూహ్యంగా పెరిగాయి. ఈ మాసంలోనే పాతిక శాతానికి పైగా బీర్‌లను విక్రయించారు.

ఇక రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.14,320 కోట్లు విలువజేసే మద్యం విక్రయాలు జరిగాయి. మద్యం నుంచి గత అక్టోబరు నుంచి ఇప్పటివరకు సర్కారుకు రూ. 30 వేల కోట్లు ఆదాయం సమకూరింది. మద్యం విక్రయాల్లో రూ.3,247 కోట్లు ఆదాయంతో  రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో ఉన్న నల్లగొండ జిల్లాలో మద్యం అమ్మకాలపై రూ.1599 కోట్ల ఆదాయం, మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ నుంచి రూ.1510 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.4 వేల కోట్లు విలువజేసే విస్కీ, బ్రాందీ కార్టన్లు, మూడున్నర కోట్ల బీర్ కేసులు మందుబాబులు తాగేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తానికి కరోనా ప్రభావంతో మందగించిన వ్యాపారాలన్నీ తిరిగి జోరందుకున్నాయి. సరిగ్గా పండుగల సమయానికి కొవిడ్ తగ్గడం కూడా వ్యాపారులకు కలిసొచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: