ఈనెల 14 నుంచి థియేటర్లను వంద శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చునని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. పండుగ వేళ విడుదలైన సినిమాలకు థియేటర్లు ఎంతవరకు ఫుల్‌ అయ్యాయనే చర్చ అటు సినీ పరిశ్రమ వర్గాల్లో, ఇటు అభిమానుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. విజయదశమి సందర్భంగా శుక్రవారం పలు కొత్త సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే. అఖిల్‌ హీరోగా నటించిన మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ సినిమా, అలాగే డైరెక్టర్‌ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందించిన పెళ్లిసందడితోపాటు మరికొన్ని సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. అసలే పండుగ, ఆపై కొత్త సినిమాలు, అందులోనూ థియేర్లను వంద శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చునని ప్రభుత్వ ఉత్తర్వులు ఉండటంతో.. సినిమా హాళ్లు హౌస్‌ ఫుల్‌ అయినట్టేనా అని సినీ వర్గాలు, అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయంలో ఒక్కోచోట ఒక్కో రకంగా పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు అడపాదడపా వస్తున్న క్రమంలో.. ఇంకా చాలా మంది థియేటర్లకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సినిమా హాళ్లు అనుకున్న స్థాయిలో ఫుల్‌ కాలేదు. మరికొన్ని చోట్ల మాత్రం థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసినట్లుగా కనిపించాయన్న చర్చ జరుగుతోంది.

మరోవైపు కరోనా ఉద్ధృతి కారణంగా మూతబడిన సినిమా థియేటర్లలో వంద శాతం సీట్లు భర్తీకి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. సినీ పరిశ్రమ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. టికెట్‌ ధరలు బి, సి సెంటర్లలో పెంచకపోవటం, ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 100ను పునఃసమీక్షించాలని పరిశ్రమ వర్గాల వారు డిమాండ్‌ చేస్తున్నారు. సీఎం జగన్‌ సన్నిహితుడైన హీరో నాగార్జున కుమారుడు అఖిల్‌ నటించిన సినిమా విడుదల దృష్ట్యా జీవో నెంబర్‌ 100ను హడావుడిగా ఇచ్చారని సినీ పరిశ్రమకు చెందిన కొందరు విమర్శిస్తున్నారు. కరెంటు బకాయిల రాయితీల అమలు, రేట్‌ ఆఫ్‌ అడ్మిషన్‌లు సినిమాల వారీగా పెంచాలని కూడా వారు డిమాండ్‌ చేస్తున్నారు.దీంతో ఏపీలో సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన వివాదం సమసిపోయే సూచనలు కనిపించటం లేదు. ఈ క్రమంలో సినీ పరిశ్రమ వర్గాలు కోరుతున్నట్లుగా టికెట్‌ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా.. జీవో నెంబర్‌ 100ను పునఃసమీక్షిస్తుందా.. అన్న ఆసక్తి నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: