పవర్ ఉన్నడో పవర్ స్టార్.. నా దగ్గర పవర్ లేదు, నన్ను పవర్ స్టార్ అని పిలవొద్దంటూ ఇటీవల అభిమానులకు సూచించారు పవన్ కల్యాణ్. ఆ లెక్కన తమిళనాడులో హీరో విజయ్ 'పవర్' స్టార్ గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయ్ అభిమానులు అక్కడ సైలెంట్ గా జెండా పాతేస్తున్నారు.

తమిళనాడు రాజకీయాలకు సినిమాలకు విడదీయరాని సంభంధం ఉంది. అప్పటి ఎంజీఆర్ మొదలుకొని.. నిన్న మొన్నటి జయలలిత వరకూ చాలామంది సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయాలను శాసించిన వారే.. ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్ తదితర హీరోలంతా రాజకీయాలపై ఎప్పుడూ ఏదో ఒక కోణంలో మాట్లాడుతూనే ఉంటారు. ఇక రజనీకాంత్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. గత రెండు దశాబ్దాలుగా, అభిమానులకు వచ్చేస్తున్నా.. రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా అంటూ ఊరించి ఊరించి ఆశలు రేకెత్తించారు. అభిమాన సంఘాల నేతలతో గత కొన్నేళ్లుగా రాజకీయపార్టీ పెడుతున్నామని చెబుతూ వచ్చారు. కానీ చివరికి ఏమైందో ఏమోగానీ పార్టీ పెట్టేది లేదంటూ ఇటీవల తేల్చి చెప్పేశారు.

ఇక కమల్ హాసన్ అయితే మరొక అడుగు ముందుకేసి.. పార్టీ కూడా పెట్టారు. అభిమానులు అండగా ఉంటారని భావించి ఎన్నికల బరిలో దిగి ఓటమిపాలయ్యారు. విజయ్ కాంత్ విషయానికొస్తే మొదట్లో మెరిసినా చివరకు ఆయన పార్టీ కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంటోంది. ఇక నేటితరం హీరోల్లో మంచి ఫాలోయింగ్ ఉండే విజయ్ కూడా రాజకీయాల్లోకి వస్తాడని తమిళనాట జోరుగా ప్రచారం జరిగింది. ఇటీవల ఆయనమీద ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ఈ ప్రచారం మరీ ఎక్కువైంది. విజయ్ తండ్రి ఓ రాజకీయ పార్టీ కూడా స్థాపించారు. అయితే ఆ రాజకీయ పార్టీతో తనకు ఎటువంటి సంబందం లేదని విజయ్ తేల్చి చెప్పారు. తనపేరును వాడుకుంటున్నారని తండ్రిపై కేసు కూడా పెట్టారు.

ఏపీలో పవన్ ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ గొడవ చేస్తుంటే, తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ సైలెంట్ గా పనికానిచ్చేస్తున్నారు. తాజాగా తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ అభిమానులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలబడ్డారు. అనూహ్యంగా 169 స్థానాల్లో పోటీచేయగా.. అందులో 115 స్థానాల్లో విజయం సాధించారు. విజయ్ అభిమానులు సాధించిన ఈ విజయంతో, ఇప్పుడు అందరి దృష్టి మరోసారి ఆయన రాజకీయ అరంగేట్రంపై పడింది. అయితే విజయ్..  తనకు, రాజకీయాలకు సంభంధం లేదని చెబుతున్నా ప్రజల్లో మాత్రం ఆయనకు ఆదరణ ఉందనే విషయం ఈ ఎన్నికలతో స్పష్టమైంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విజయ్.. నేరుగా రాజకీయాల్లోకి వస్తారో.. లేక రజనీకాంత్ మాదిరిగానే సైడ్ అయిపోతారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: