ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. 2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... ముందుగా తాము ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన నవరత్నాల అమలుపైనే ప్రధానంగా దృష్టి సారించింది. అటు మూడు రాజధానుల ప్రకటన, కరోనా వైరస్ ప్రభావంతో... ప్రస్తుతం రాష్ట్ర ఖజనా ఖాళీ అయ్యింది. ఇప్పటికే అందినంత మేర అప్పులు చేసింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఇక కొత్త అప్పుల కోసం విశాఖలో ప్రభుత్వ ఆస్తులను కూడా బ్యాంకులకు తనఖా పెట్టేసింది. ఇక ఉద్యోగుల వేతనం అయితే ఒకటో తేదీ రావడమే గగనమై పోయింది. పెన్షన్ డబ్బుల కోసం కూడా రిటైర్డ్ ఉద్యోగులు ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఇక బకాయిలు చెల్లించండి అంటూ కాంట్రాక్టర్లు భిక్షాటన చేసి దీని ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉపాధి హామీ పనుల బకాయిల కోసం బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా చెల్లింపుపై తుది గడువు విధించింది.

రాష్ట్ర ఖజానాకు సంబంధించిన 25 వేల కోట్ల రూపాయలకు పైగా డబ్బులకు ఎలాంటి లెక్కలు లేవని ఇప్పటికే ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే ఓ కన్ను వేసినట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇంత ఇబ్బంది కరంగా ఉంటే... సంబంధిత శాఖ మంత్రి మాత్రం ప్రస్తుతం ఎక్కడా కనిపించటం లేదు. కీలకమైన ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి... దాదాపు నెల రోజులుగా కనిపించటం లేదు. కనీసం ఎక్కడ ఉన్నారో కూడా తెలియటం లేదు. బకాయిలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి బదులు లేదు. చివరికి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు కూడా ప్రభుత్వ ప్రధాన సలహాదారు నిర్వహించారు తప్ప.... ఉద్యోగులకు ఆర్థిక శాఖ తరఫున ఎలాంటి హామీ రాలేదు. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తింది. కావాల్సిన నిధులు కేటాయించేందుకు కూడా మంత్రి గారు కనిపించటం లేదనే అపవాదు వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: