భారతీయ జనతా పార్టీ నేతలకు, పబ్లిసిటీకి విడదీయరాని సంబంధం ఉందనేది వైరిపక్షాల ఘాటు విమర్శ. ప్రతి కార్యక్రమాన్ని ప్రచారం చేసుకోవడం బీజేపీ నేతలకు అలవాటేనని అంటుంటారు. ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా.. పైస్థాయి నేతల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త వరకూ ప్రచారంలో ఊదరగొట్టడం రాజకీయ నాయకులకు అలవాటే అయినా.. బీజేపీలో అది కాస్త శృతి మించిందనే అపవాదు ఉంది. తాజాగా బీజేపీ కేంద్ర మంత్రి చేసిన ఓ పని మరిన్ని విమర్శలకు తావిస్తోంది. బీజేపీ నేతలకు మరీ ఇంత పబ్లిసిటీ పిచ్చిపట్టిందేంటని అనుకునేలా చేసింది.

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు రావడం మామూలే. అయితే ఇలా వచ్చి, కేవలం పరామర్శించి వెళ్ళిపోయుంటే బాగుండేది. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా ప్రచారానికి వాడుకోవాలని చూశారు కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ. మన్మోహన్ కదల్లేని పరిస్థితిలో ఉండే ఫొటోను తీయించి బయటకు వదిలారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు ఫోటోలు తీయొద్దని చెప్పినా.. వినకుండా పరామర్శల ఫొటోలను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు పోస్ట్ చేసి, ఆ తర్వాత విమర్శల దాడి తట్టుకోలేక వాటిని డిలీట్ చేశారు.

బీజేపీ కేంద్రమంత్రి మన్ సుఖ్ చేసిన ఈ పనికి పార్టీ పరువు గంగపాలైంది. ఆయనపై కొందరు బీజేపీ నేతలతో పాటూ.. అభిమానులూ ఫైర్ అవుతున్నారు. మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ కూడా కేంద్రమంత్రి చేసిన పనిని తప్పుపట్టారు. తన తండ్రి ఫోటోలు తీయవద్దని వారించినా.. మంత్రి పెడచెవిన పెట్టారని అన్నారు. పరామర్శించి వెళ్లకుండా ఇలా ఫోటోలు దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తన తండ్రి ఆరోగ్యంపై బాధలో ఉన్న తమను ఈ ఫోటోల ప్రచారం మరింతగా బాధించిందని చెప్పుకొచ్చారు. ఫొటోగ్రాఫర్ ని ఐసీయూ వార్డ్ లోకి తీసుకు రావద్దని వారించినా మంత్రి వినలేదని అన్నారామె. ఏది ఏమైనా ఇలా ప్రతీది ప్రచారం చేసుకోవడం బీజేపీ నేతలకు పరిపాటిగా మారిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp