తమిళనాడు రాజకీయాల్లో శశికళ పాత్ర ఎంతో కీలకంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత నిచ్చెలిగా పేరున్న శశికళ... తమిళ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. ఏఐఏడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో వ్యవహరించిన శశికళను అంతా చిన్నమ్మ అని పిలుచుకుంటారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిన్నమ్మ చక్రం తిప్పారు. అయితే అనూహ్యంగా అక్రమాస్తుల కేసులో నేరం రుజువవ్వడంతో... బెంగళూరులోని పరంపణ జైలులో దాదాపు నాలుగేళ్ల పాటు ఖైధీగా శిక్ష అనుభవించారు కూడా. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాత భారీ కాన్వాయ్‌తో బెంగళూరు నుంచి చెన్నై చేరుకున్నారు. తమిళ రాజకీయాల్లో మళ్లి చక్రం తిప్పుతారని... ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అన్నాడీఎంకే పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు శశికళ. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు కూడా. కనీసం ఎన్నికల సమయంలో కూడా ప్రచారం నిర్వహించలేదు.

కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న శశికళ.. తొలిసారి బయటకు వస్తున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఉన్న జయలలిత మెమోరియల్ వద్ద శశికళ నివాళులు అర్పించనున్నారు. అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపక స్వర్ణోత్సవ వేడుకలకు సరిగ్గా ఒకరోజు ముందు జయలలిత స్మారక స్థూపాన్ని శశికళ సందర్శించడం వెనుక రాజకీయ ముఖ్యమైన ఎత్తుగడ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జయలలిత రాజకీయ వారసురాలిగా గుర్తింపు పొందిన శశికళను పార్టీ ప్రస్తుత నేతలు, మాజీ ముఖ్యమంత్రులు ఓ.పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళని స్వామిలు అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. అక్రమాస్తుల కేసులో అరెస్టు అవ్వడమే ఇందుకు కారణంగా చూపారు. పార్టీతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రకటించారు. జైలు నుంచి విడుదలైన శశికళను పరామర్శించిన నేతలపై కూడా వేటు వేసింది అన్నా డీఎంకే అధినాయకత్వం. 2016 డిసెంబర్ నెలలో జయలలిత మృతి చెందిన తర్వాత మెరీనా బీచ్‌లోని మెమోరియల్ వద్ద శపధం చేసిన శశికళ... దాదాపు ఐదేళ్ల తర్వాత... తొలిసారి మళ్లీ సమాధి వద్దకు వస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: