జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించారు శశికళ. జయలలితను తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సమాధిపై పూలు జల్లి నివాళులర్పించారు. అన్నా డీఎంకే పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పటికీ  శశికళ మాత్రం అన్నాడీఎంకే జెండా తోనే బయటికి వచ్చారు. తన కారు పై అన్నాడీఎంకే జెండాను పెట్టుకొని మెరీనా బీచ్ కు వచ్చారు. కార్యకర్తలు సైతం అన్నాడీఎంకే జెండాలతోనే శశికళకు ఘన స్వాగతం పలికారు. రేపు అన్నాడీఎంకే పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో జయలలితతో పాటు మెరీనా బీచ్ లో ఉన్న అన్నాదురై, ఎంజీఆర్ సమాధుల వద్ద నివాళులర్పించారు శశికళ.

రేపు కూడా శశికళ కొన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రామవరం గార్డెన్ లోని ఎంజీఆర్ నివాసం లో నిర్వహిస్తున్న స్కూల్ ను సందర్శిస్తారని శశికళ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ దారుణంగా ఓడిపోయింది. తొమ్మిది జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో  కాంచీపురం తో సహా అన్ని స్థానాలను అధికార పార్టీ డీఎంకే క్లీన్ స్వీప్ చేసింది. 153 పంచాయతీ వార్డులకు  ఎన్నికలు జరిగితే డీఎంకే 139 స్థానాలు గెలిచింది. అన్నాడీఎంకే కేవలం రెండు స్థానాలతోనే సరిపెట్టుకుంది. దీంతో పార్టీ నడిపించాలంటే తాను రాక తప్పదని సంకేతాలు పంపించారు శశికళ. పలని,పన్నీరు ఉన్నప్పటికీ పార్టీని గట్టెక్కించ లేకపోతున్నారన్నది శశికళ సన్నిహిత వర్గాల మాట. ఈ సమయంలో పార్టీకి పునర్ వైభవం తన వల్లే అయితుందన్న సిగ్నల్స్ పార్టీ కార్యకర్తలకు పంపిస్తున్నారు. శశికళకు అన్నాడీఎంకే  పార్టీలో స్థానం లేదని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ డోర్ ను ఎప్పుడో మూసేసామని, చిన్నమ్మ తిరిగి పార్టీలోకి రాలేదని గత ఎన్నికల అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఎంత హడావిడి చేసిన శశికళను అన్నాడీఎంకే పార్టీ లోకి  తీసుకునేది లేదని తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: