ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పట్టణాల్లో పగలు 12 గంటలకు, పల్లెల్లో సాయంత్రం 6 గంటలకు కరెంట్ పోతోంది. బొగ్గు కొరత కారణంగా ఇప్పటికే అన్ని ధర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా ఉత్పత్తిని తగ్గించేశాయి. ఇక బొగ్గు కొరతపై స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. కరెంట్ కోతలు లేకుండా చూడాలని సూచించారు. అటు విద్యుత్ సంక్షోభం తలెత్తిందని.... సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు ఏసీల వినియోగం తగ్గించాలని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్వయంగా ప్రకటించారు. పరిస్థితి ఇంత తీవ్రంగ ఉన్నప్పటికీ... విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం కనీసం స్పందించలేదు. చివరికి ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షకు కూడా మంత్రి హాజరు కాలేదు. విపక్షాలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ... విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు కూడా చేశాయి.

నిన్నటి వరకు జస్ట్ ఒక ట్వీట్‌తో సరిపెట్టిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి... విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు. విద్యుత్ కోతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఖండించారు. విపక్షాలు కావాలనే తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఎదురు దాడి చేశారు. విద్యుత్ కోతలకు అసలైన కారణాన్ని మంత్రి బాలినేని  స్వయంగా వెల్లడించారు. రాష్ట్రంలో కేవలం బొగ్గు కొరత వల్ల మాత్రమే విద్యుత్ సమస్య తలెత్తిందన్నారు బాలినేని. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కూడా బొగ్గు కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రజలకు విద్యుత్ కోతలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకోసం బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. విద్యుత్ సమస్య నేపథ్యంలో ప్రభుత్వంపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే... వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. విద్యుత్ కొరత ఉందని... అయితే కోతలు మాత్రం లేవన్నారు. తమది ప్రజా ప్రభుత్వం అన్నారు. టీడీపీ నేత లోకేష్ చేసిన విమర్శలను కూడా బాలినేని తిప్పికొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: