హుజురాబాద్  ఉప ఎన్నిక ప్రచారాన్ని అధికార టీఆర్ఎస్ కు ధీటుగా హోరెత్తించాలని బిజెపి నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభతో ప్రచారాన్ని ముగించాలని భావిస్తోందని టాక్ వినిపిస్తోంది. వెయ్యి మందికి మించి బహిరంగ సభ, ర్యాలీలు నిర్వహించద్దని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆంక్షలు విధించింది. దీంతో తొలుత అమిత్ షా  సభను రద్దు చేసుకున్నా తాజా పరిణామాల నేపథ్యంలో సభ నిర్వహించాలని ఆ పార్టీ అగ్ర నాయకులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపును  బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటర్లను చేరుకునేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని నిర్ణయించింది బిజెపి.

 హుజురాబాద్ లో  కచ్చితంగా గెలిచే తీరాల్సిందేనని జాతీయ అధినాయకత్వం కూడా ఖచ్చితమైన ఆదేశాలను జారీ చేయడంతో ఆ దిశగా వ్యూహాలు ప్రతివ్యూహాలతో కార్యాచరణ ప్రణాళికలను రాష్ట్ర నాయకత్వం రూపొందిస్తోంది. టిఆర్ఎస్ కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ నే అనే సంకేతాన్ని ప్రజల్లో బలంగా తీసుకువెళ్లేందుకు ఈ విజయం దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇక టిఆర్ఎస్ కూడా ఇక్కడ  గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొన్నటి వరకు కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం, ఆ తర్వాత ఆయనను పార్టీ నుండి బయటకు వెళ్ళేలా చేయడం, చివరకు ఈటెల బీజేపీలో చేరడం, బీజేపీలో చేరిన ఆయన తన  ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడం జరిగిపోయాయి. ఈటెల రాజీనామాతో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక  జరుగుతోంది. దీంతో ఈ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో 2023 ఎన్నికలకు ఓ దిక్సూచి అవుతుందన్న విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. మరోవైపు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు  గా రేవంత్ రెడ్డి వచ్చాక ఆయన ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలో ఆయనక్కూడా ఈ ఉప ఎన్నిక పెద్ద పరీక్షగా మారనుంది. అయితే కేసీఆర్ కూడా ఈ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి ఇచ్చిన షాక్ నుండి  కెసిఆర్ తో పాటు టిఆర్ఎస్ అగ్ర నాయకత్వం కోలుకోవడం లేదు. ఇప్పుడు హుజురాబాద్ లో కూడా బీజేపీ గెలిస్తే కెసిఆర్ మరింత ఇరకాటంలో పడతారు.

దీంతో ఈ ఉప  ఎన్నికల్లో ఎలాగైనా ఈటెల ను ఓడించి తెలంగాణలో బీజేపీది బలుపు కాదని అదంతా వాపే అని రుజువు చేయాలని కెసిఆర్ పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే ఈ ఉప ఎన్నిక బాధ్యతలను మంత్రి హరీష్ రావు తో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు మంత్రులకు  అప్పగించారు. రేపటి ఫలితాల్లో తేడా రాకుండా కారు జోరు సాగేలా నేతలకీ బాధ్యతలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: