హుజురాబాద్‌లో అధికార టీఆర్ఎస్‌ పార్టీకి అనుకున్నంతగా మైలేజీ రాలేదా? దాన్ని పెంచేందుకు మళ్లీ కేసీఆర్‌ సభ పెట్టాలని టీఆర్ఎస్‌ భావిస్తోందా? అంటే అవుననే అంటున్నాయి గులాబీ పార్టీ వర్గాలు. హుజురాబాద్‌ ఉపఎన్నికకు సమయం సమీపిస్తుండటంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తించడంపై దృష్టి సారించాయి. ప్రస్తుతం దసరా పండుగకు మూడు రోజులపాటు ప్రచారానికి విరామం ఇచ్చారు టీఆర్ఎస్‌ ముఖ్య నాయకులు. అయితే గత నాలుగైదు నెలలుగా హుజురాబాద్‌లోనే గులాబీ నేతలు మకాం వేసి చేసిన ప్రచారం పార్టీకి ఎంతవరకు మైలేజీ తెచ్చింది? అనే దానిపై అంతర్గతంగా చర్చించుకున్నారు. కానీ పార్టీకి అనుకున్నంత మైలేజీ రాలేదని వారి వాదనల్లో తేలింది. ఇలాగైతే లాభం లేదని.. హుజురాబాద్‌లో కారు జోరు పెంచాలంటే.. ఉపఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ సభ పెట్టాల్సిందేనని నియోజకవర్గంలోని మండలాల పార్టీ ఇన్‌ఛార్జిలు సలహా ఇచ్చారు. దీంతో హుజురాబాద్‌ ఉపఎన్నిక ప్రచారానికి కేసీఆర్‌ సభతో ఫుల్‌స్టాప్‌ పెట్టాలని టీఆర్ఎస్‌ భావిస్తున్నట్లు సమాచారం.

ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత తొలిసారి సీఎం కేసీఆర్ హుజురాబాద్‎లో పర్యటించారు. ఆగస్టు 16న దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‎లోనే ఆయన ప్రారంభించారు. అయితే ఐదు నెలల ప్రచారంలో టీఆర్‌ఎస్‌కు చెప్పుకోదగ్గ సభ అదొక్కటే అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆ తర్వాత హరీశ్‌ రావు కుల సంఘాలతో సమావేశాలు పెట్టి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే మండలాల ఇన్‌ఛార్జిలు ఐదు నెలలుగా హుజురాబాద్‎లో ప్రచారం చేస్తున్నా.. అది అనుకున్నంత సక్సెస్ కాలేకపోతోందన్న భావనపార్టీ శ్రేణుల్లో ఉంది. ఎంత తిరిగినా.. ఎంత చేస్తున్నా టీఆర్‌ఎస్‌కు మైలేజీ రావడం లేదని ఆ పార్టీ నేతల అంతర్గత చర్చల్లో ప్రస్తావన‎కు వచ్చింది. దీంతో హుజురాబాద్‎లో ఓటర్ల మైండ్ సెట్ తమ వైపునకు తిప్పుకోవాలంటే సీఎం కేసీఆర్ తోనే సాధ్యం అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే రెండోసారి కేసీఆర్‌తో సభ ప్లాన్ చేస్తోంది. ఎన్నికల కోడ్ లేని, మండలాల్లో కేసీఆర్ సభ పెట్టాలని టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆలోచన చేస్తున్నాయి.

మూడు మండలాల టీఆర్ఎస్‌ ఇన్‌ఛార్జిలు, నాయకుల్లో వ్యక్తమైన అభిప్రాయాన్ని ఇటీవల కేసీఆర్‌ దృష్టికి మంత్రి హరీశ్‌రావు తీసుకెళ్లారట. అయితే పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల కలెక్టరేట్‌లు, మెడికల్ కాలేజీల భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఆ జిల్లాల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలోనే కేసీఆర్ పర్యటనలు ఉండేలా చూస్తున్నారు. కేసీఆర్ కూడా పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పర్యటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: