ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండున్నర ఏళ్లు ముగుస్తోంది. ఈ 30 నెలల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎక్కువ ఆరోపణలు చేసిన నేత ఎవరూ అంటే... అంతా ఠక్కున ఏక కంఠంతో చెప్పే పేరు రఘురామ కృష్ణంరాజు. 30 నెలల కాలంలో... ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల కంటే కూడా... రఘురామ కృష్ణంరాజు చేసిన ఆరోపణలే ఎక్కువ. ఇంకా చెప్పాలంటే... కోర్టులో కేసులు వేసి ఓ దశలో సొంత పార్టీ నేతలను కూడా ఇరుకున పెట్టారు. వైసీపీ రెబల్ ఎంపీగా ప్రస్తుతం రఘురామ కృష్ణంరాజు ముద్ర పడ్డారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సరిగ్గా ఆరు నెలల పాటు సైలెంట్‌గా ఉన్న రఘురామ కృష్ణంరాజు.... ఆ తర్వాత నుంచి వైలెంట్‌గా మారారు. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అసలు ఎన్నికల్లో తాను గెలిచింది జగన్ ఫోటో వల్ల కాదన్నారు. అలా అయితే 2014 ఎన్నికల్లోనే వైసీపీ నేతలు గెలవాలని... అప్పుడే జగన్ ముఖ్యమంత్రి అయ్యే వారు కదా అని కూడా అనేశారు.

ఒక దశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఇది అప్పట్లో పెను సంచలనం రేపింది. ఇక తనను సొంత నియోజకవర్గం వెళ్లకుండా అడ్డుకుంటున్నారంటూ రఘురామ కూడా లోక్‌సభ స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇదే సమయంలో రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ... ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. ఇదే  పెద్ద ఎపిసోడ్‌గా మారింది. గతంలో రఘురామ కృష్ణంరాజుపై ముప్పేట దాడి చేసిన వైసీపీ నేతలు.. ఆయనపై అనర్హత వేటు వేయాలని కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తి రివర్స్ అయినట్లుగా ఉంది. ప్రతి రోజు సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు రఘురామ కృష్ణంరాజు ప్రెస్ మీట్ పెట్టి.... వైసీపీ ప్రభుత్వంపై రఘురామ కృష్ణంరాజు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అసలు స్పందించేందుకు కూడా ఇష్టపడటం లేదు. అసలు అనర్హత వేటు పిటిషన్ పై కూడా చర్చించటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: