హుజురాబాద్‌ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్‌ పార్టీకి కొత్త టెన్షన్‌ పట్టుకుంది. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు గులాబీ పార్టీ నేతల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. కారును పోలిన గుర్తులు ఎక్కడ తమ కొంప ముంచుతాయో అనే ఆందోళన గులాబీ నేతల్లో కనిపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో పలుచోట్ల ఓటమికి కారణమైన గుర్తులే.. హుజురాబాద్ ఉప ఎన్నికలోనూ కేటాయించడంతో కారు పార్టీలో కంగారు రేకెత్తింది.

నిజానికి ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలు  ఎంతముఖ్యమో..  వారి పార్టీ బలం, బలగం, గుర్తు కూడా అంతే ముఖ్యం. అందుకే ప్రజల్లో రిజిస్టర్ అయిన గుర్తుల మీద పోటీ చేయడానికి నేతలు మొగ్గు చూపుతుంటారు. స్వతంత్రులు అయితే ఓటర్లు ఈజీగా గుర్తుపట్టే గుర్తుల కోసం ఈసీని కోరుతుంటారు. రిజిస్టర్డ్ పార్టీలను పోలిన గుర్తులతో వారి  ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. అయితే పార్టీల గెలుపోటముల మీద.. స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు  ప్రభావం చూపుతున్నాయి. తాజాగా హుజురా బాద్ ఉప ఎన్నికలో  కూడా అలాంటి గుర్తులే అధికార టిఆర్ఎస్ కు ఇబ్బందిగా మారాయన్న చర్చ జరుగుతోంది.

ఉపఎన్నిక సమీపిస్తున్న వేళ ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న కొత్త సమస్యలు... టీఆర్ఎస్ నాయకత్వాన్ని  ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఇప్పుడు కారును పోలిన గుర్తులు మరింత కంగారు పెట్టిస్తున్నాయ్. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత 30 మంది అభ్యర్ధులు బరిలో మిగిలారు.  ఇందులో ప్రజావాణి పార్టీ అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తు, ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థికి  చపాతి రోలర్ గుర్తులు వచ్చాయి. గతంలో భువనగిరి పార్లమెంట్ స్థానం, నకిరేకల్, తాండూరు లాంటి స్థానాల్లో  ట్రక్కు, రోడ్డు రోలర్, చపాతి రోలర్ లాంటి గుర్తులు టీఆర్‌ఎస్‌ పార్టీని దెబ్బ తీశాయ్. ఆ పార్టీకి ఓటు వేయాలనుకున్న వారిని గుర్తులు గందరగోళానికి గురిచేశాయనీ, దీంతో వారు కారు గుర్తుకు దగ్గరగా ఉన్న వాటికి పొరపాటున ఓట్లు వేశారన్న చర్చ జోరుగానే సాగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ నేతలు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాల ను కలిసి అలాంటి గుర్తులు కేటాయించవద్దని కోరినా ఫలితం లేదు. కొన్ని గుర్తులు  గులాబీ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయ్..!

మరోవైపు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు, బీజేపీ కమలం గుర్తుకు పెద్దగా ఇబ్బంది కనిపించడం లేదు. ఎటొచ్చి టీఆర్ఎస్ పార్టీ సింబల్‌ కారును పోలిన గుర్తులే గులాబీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. గతంలో పలుమార్లు అలాంటి గుర్తుల వల్ల ఓడిన అనుభవంతో కారు పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. హుజురాబాద్ లో మళ్లీ రోడ్డు రోలర్, రోటీ మేకర్ గర్తులు ఉండటంతో ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: