హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలకు సరిగ్గా 15 రోజులు సమయం మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలలో సానుభూతి పొందేందుకు ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నారన్న హరీష్ రావు... బీజేపీ మీటింగ్‌లకు కరెంట్ కట్ చేసి... వేధిస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈటల మైక్ మూగబోతే... అదేదో టీఆర్ఎస్ వాళ్లు చేశారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఫంక్షన్ హాలు యజామాన్యం... కరెంట్ బిల్లు కట్టలేదు కాబట్టే... విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు హరీష్ తెలిపారు. ప్రభుత్వ విప్ బాల్కా సుమన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ... ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ... జాతీయ రహదారిపై ధర్నా చేశారన్నారు మంత్రి హరీష్ రావు. ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు డబ్బులు, మద్యం పంచుతున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు తప్ప... ఒక్కసారి కూడా  రుజువు చేయటం లేదన్నారు.

గ్యాస్ సిలిండర్‌పై రాష్ట్ర ప్రభుత్వం 291 రూపాయలు పన్ను వేస్తోందంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న హరీష్... ఏడేళ్లు మంత్రిగా ఉన్న ఈటలకు వాస్తవాలు తెలియవా అని ప్రశ్నించారు. జీఎస్టీ వచ్చిన తర్వాత... సిలిండర్‌పై పన్ను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నారు హరీష్. టీఆర్ఎస్ ప్రభుత్వం పండుగ పూట వడ్డీలేని రుణం ఇస్తే, బీజేపీ మాత్రం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని ఆరోపించారు. హుజురాబాద్‌లో పాదయాత్ర సమయంలో గ్రైండర్లు, కుట్టుమిషన్లు, గడియారాలు పంచింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఈటల గెలిస్తే... ఢిల్లీ పెద్దలకు గులాం గిరి చేయాల్సిందే అన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రజలకు మాత్రమే గులాంలా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో తమ పార్టీ చేసిన పనులు చెప్పుకోవాలి. లేదా  ఎదుటిపార్టీ వైఫల్యాలు ఎత్తి చూపాలన్నారు హరీష్ రావు. బీజేపీని ఈటల ఓన్ చేసుకోవడం లేదని... అలాగే ఈటలను కూడా బీజేపీ ఓన్ చేసుకోవడం లేదన్నారు. బీజేపికి  రాజేందర్ దూరం ఉన్నరన్న హరీష్ రావు.... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలకు తాను దూరం అన్నట్లు, తాను భాగం కాన్నట్లు మాట్లాడుతున్నడని ఆరోపించారు హరీష్ రావు. రాబోయే రోజుల్లో అబద్దాల ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు హరీష్ రావు.


మరింత సమాచారం తెలుసుకోండి: