తిరుపతిలో కుండపోత వర్షం కురిసింది. శనివారం సాయంత్రం ప్రారంభమైన వర్షం సుమారు మూడు గంటలపాటు ఏకధాటిగా, ఉధృతంగా పడింది. దంచికొట్టిన వర్షం దెబ్బకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా మధురానగర్‌ వీధులన్నీ మునిగిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో ఇళ్లల్లోకి భారీగా మురుగునీరు చేరింది. పేదలు నివసించే ఇందిరా నగర్, సంజయ్ గాంధీ కాలనీ, శివ జ్యోతి నగర్, సుందరయ్య నగర్, సప్తగిరి కాలనీ, న్యూ ఇందిరానగర్, చెన్నా రెడ్డి కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయి. మధురానగర్‌లోని వీధుల్లో నడుము లోతుకు పైగా వర్షపు నీరు చేరింది. డ్రైనేజీ నీరు ఇళ్లల్లోకి రావడంతో దుర్గంధం భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గతంలోనూ కుండపోతగా కురిసిన వర్షాలకు మధురానగర్‌లో వీధులన్నీ జలమయం అయ్యాయి. ఈ సమస్య తరుచూ ఉత్పన్నం అవుతోందని, తమకు పరిష్కారం చూపాలని మధురానగర్‌ వాసులు పలుసార్లు మున్సిపల్‌ అధికారులకు విన్నవించుకున్నా లాభం లేకపోయింది. తాజాగా శనివారం కుండపోతగా కురిసిన వర్షానికి మధురానగర్‌ మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈసారి ఇళ్లల్లోకి భారీగా డ్రైనేజీ నీరు చేరుకోవడమే కాకుండా.. కార్లు, వాహనాలు సైతం మునిగిపోయాయి. ఖరీదైన వాహనాలు దెబ్బతిని పాడైపోయే పరిస్థితి ఎదురైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లల్లోకి చేరిన డ్రైనేజీ నీరుని బయటకు పంపేందుకు ఇంటిల్లి పాదీ అవస్థలు పడాల్సిన దుస్థితి దాపురించిందని శాపనార్థాలు పెడుతున్నారు.

మున్సిపల్‌ అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడమే.. తిరుపతిలో భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారీ కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయన్న ఆందోళన నగరవాసుల్లో వ్యక్తమవుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని ముందస్తు హెచ్చరికలు ఉన్నా.. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించలేదని, తగిన విధంగా ముందస్తు జాగ్రత్తలు, చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్న విమర్శలు తిరుపతి వాసుల్లో వ్యక్తమవుతున్నాయి.

తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తిరుపతి నగరవాసులు మరింత ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే మధురానగర్‌తోపాటు పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక్కడ పరిస్థితిని చక్కదిద్దాలంటే మున్సిపల్‌ సిబ్బందికి చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో.. తమ ప్రాంతాల్లో సాధారణ స్థితి ఎప్పుడు నెలకొంటుందోనన్న ఆందోళన బాధిత కాలనీల వాసుల్లో అధికమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: