హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో... నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీల నేతలు... విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల ముఖ్య నేతలు నియోజకవర్గంలో పాదయాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ మధ్య పోటీ నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్ ప్రశ్నావళి కురిపించగా.... ఈటల మాత్రం టీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఉప ఎన్నికల రాజకీయంతో ఒకరిపై ఒకరు నువ్వా నేనా అన్నట్లు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఈటల రాజేందర్... నేరుగా సీఎం కేసీఆర్‌నే టార్గెట్ చేశారు.

కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం కేసీఆర్ పతనానికి నాంది కాబోతున్నాయన్నారు ఈటల రాజేందర్. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఇంతలా ఉండేందుకు ప్రధాన కారణం తానే అన్నారు ఈటల. తనపై కావాలనే కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఈటల ధ్వజమెత్తారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో తానేని అభివృద్ధి చేయలేదంటూ నిందలు వేస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తప్పు చేసినట్లు ఇప్పటి వరకు రుజువు చేయలేక పోయారన్నారు ఈటల. ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్ సమయంలో ఓటుతో కేసీఆర్ గూబ గుయ్ అనేలా ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాలని ఈటల పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ప్రగతి భవన్‌కే పరిమితం అయిన కేసీఆర్.... హుజూరాబాద్‌లో ఓటమి భయంతోనే దళిత బంధు పథకాన్ని ప్రకటించారని ఈటల దుయ్యబట్టారు. ఓట్ల కోసం అధికార పార్టీ నేతలు కోట్లు కుమ్మరిస్తున్నారని... డబ్బుకు ఓటు అమ్ముకునే రకం హుజురాబాద్ ఓటర్లు కాదన్నారు ఈటల.


మరింత సమాచారం తెలుసుకోండి: