ఏఐసీసీ అధ్యక్ష పదవిలో రాహుల్ గాంధీని కూర్చోబెట్టాలనుకున్న సోనియా గాంధీ కల ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. తాజాగా జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ లో ఈ వ్యవహారం చర్చకు వచ్చింది. అయితే ఈ నిర్ణయం మరో ఏడాదిపాటు వాయిదా పడింది. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత, ఏఐసీసీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారట. అయితే ప్రస్తుతానికి లాంఛనంగా రాహుల్ పేరునే ప్రతిపాదించినప్పటికీ.. అప్పటి వరకూ తానే ప్రెసిడెంట్ గా ఉంటానని సోనియా గాంధీ స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి వారసుడు.. అయినాసరే పార్టీ పగ్గాలు తీసుకోవడానికి ఎందుకు ఒప్పుకోవడంలేదో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇదే విషయంపై ఇప్పటికే ఎన్నోసార్లు పార్టీ సీనియర్లు చర్చించినా.. రాహుల్ మాత్రం అంగీకరించడం లేదు. మరోవైపు కాంగ్రెస్ వారసురాలిగా ప్రియాంకా గాంధీ ఉండాలని.. నానమ్మ ఇందిరా గాంధీలా ఆమె జనాన్ని ఆకట్టుకుంటారని కొందరుసీనియర్లు మొదట్లో భావించేవారు. ఆమె ఆహార్యం కూడా ఇందిరా గాంధీని పోలి ఉండటంతో, అప్పట్లో అందరూ ఆమెను వారసురాలిగా ప్రకటిస్తారని అనుకునేవారు. అయితే అప్పుడప్పుడు రాహుల్ కు మద్దతుగా ప్రియాంక రాజకీయాల్లో కనిపిస్తున్నారే తప్పించి.. పూర్తి స్థాయి భాద్యతలను మాత్రం భుజానికెత్తుకోవడం లేదు.

తాజాగా ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. 2022 సెప్టెంబర్ లోపు ఈ తతంగాన్ని ముగించాలని నిర్ణయించింది. వచ్చే నెల ప్రారంభం నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2022 ఆగస్ట్ వరకూ ఈ ప్రక్రియ కొనసాగనుంది. అప్పటివరకూ సోనియాగాంధీ ఏఐసీసీ భాద్యతలను పర్యవేక్షిస్తారు. ఆ తరువాత మాత్రం పార్టీ భాద్యతలను తీసుకునేందుకు రాహుల్ గాంధీ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ సీనియర్లతో ఇప్పటికే సమావేశం కూడా జరిపినట్టుగా తెలుస్తోంది. దీంతో యువరాజుగా రాహుల్ గాంధీ నియామకం ఓ కొలిక్కి వచ్చినట్లయింది. ఇక మరోవైపు ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇస్తారనే మాటల్లో నిజం లేదని తాజా మీటింగ్ తో తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: