ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకూ సచివాలయం, ఇతర శాఖల ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత వసతిని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి మీడియాకు తెలిపారు. సచివాలయం, ఇతర కీలక శాఖల ఉద్యోగులు చంద్రబాబు హయాంలో అమరావతి వచ్చేందుకు ముందు సుముఖత వ్యక్తం చేయలేదు. రాజధాని నిర్మాణం కాకుండానే అమరావతికి ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. దీంతో అప్పట్లో చంద్రబాబు సర్కారు ఈ ఉద్యోగులకు కొన్ని తాయిలాలు ప్రకటించింది.


రాజధానికి తరలివస్తే.. నివాసం ఖర్చు ప్రభుత్వమే పెట్టుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ హామీ గడువు ఈనెలతో ముగిసిపోతోంది. అందుకే .. దీన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని ఉద్యోగుల సంఘం సీఎం జగన్‌ను కలిసి కోరింది. ఉద్యోగ సంఘాల కోరికను సీఎం జగన్ మన్నించారు. మరో ఆరు నెలల పాటు ఉచిత వసతి కల్పించేందుకు  ఓకే చెప్పారు. దీంతో రాజధాని పరిధిలో ఉండే ఉద్యోగులకు మరో ఆరు నెలల పాటు ఉచిత వసతి అవకాశం దక్కబోతోంది.


అయితే ఈ ఉచిత వసతి పొడిగించే సౌకర్యం సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఉద్యోగుల భద్రతలో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రెండడుగుల ముందే ఉంటారని ఇటీవలే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  తెలిపారు.   ఉద్యోగులకు ఎప్పుడు ఏ సమస్య వ‌చ్చినా కచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని  స‌జ్జల అన్నారు. ఇదే సమయంలో  గతంలో తమ ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్ని హామీలు నెరవేర్చిందో గుర్తు చేశారు.


గతంలో సుదీర్ఘకాలంగా ఉన్న ఆర్టీసీ డిమాండ్లను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నెర‌వేర్చిన సంగతి సజ్జల గుర్తు చేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 27శాతం ఐఆర్ హామీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ నెరవేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. మొత్తానికి ప్రభుత్వంపై గుస్సాగా ఉన్న ఉద్యోగులపై కాస్త కరుణచూపిస్తోందన్నమాట  ఏపీ సర్కారు.


మరింత సమాచారం తెలుసుకోండి: