గతేడాది మార్చి నెలలో మొదలైన కరోనా వైరస్ కల్లోలం... ఇప్పుడు దాదాపు కంట్రోల్‌లోనే ఉంది. గతేడాది మార్చి నెల 18వ తేదీన దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని దేవస్థానాలు దాదాపు మూత పడ్డాయి. కలియుగ శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల దివ్య క్షేత్రం అయితే... ఏకంగా 2 నెలల పాటు భక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించింది. నిత్య కైంకర్యాలు యధావిధిగా ఏకాంతంగా నిర్వహించినప్పటికీ... భక్తులకు మాత్రం స్వామి వారి దర్శన భాగ్యం కల్పించలేదు. నెమ్మదిగా కరోనా వైరస్ కేసులు తగ్గడంతో... ఆలయ తలుపులు కూడా తెరుచుకున్నాయి. అయితే కొవిడ్ నిబంధనలు తప్పనిసరి చేశారు. గతేడాది ఆలయంలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా పూర్తిగా ఏకాంతంగానే... అంతరాలయంలోనే నిర్వహించారు. ఆ తర్వాత నెమ్మదిగా స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ముందుగా కేవలం రోజుకు 4 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు... క్రమంగా 8 వేలు, 15 వేల మందిని అనుమతిచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు సర్వ దర్శనం కూడా ప్రారంభించారు.

గతేడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తి ఏకాంతంగా నిర్వహించారు. అయితే ప్రతి నెల పౌర్ణమి రోజు నిర్వహించే గరుడ సేవ బహిరంగంగానే నిర్వహిస్తున్నారు. అటు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కూడా భారీగానే నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగానే జరుగుతుంది. ఇప్పటి వరకు వంద కోట్ల డోసుల వరకు ఇచ్చారు. కానీ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మాత్రం ఇంకా కొవిడ్ భయం వదిలినట్లు లేదు. దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను మాత్రం మరోసారి ఏకాంతంగానే... ఆలయంలో నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు యధావిధిగా జరుగుతున్నాయి. సినిమా థియేటర్లల్లో పూర్తిస్థాయి ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. అలాంటి సమయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మాత్రం ఎందుకు ఏకాంతంగా నిర్వహించారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అసలు రాజకీయ పార్టీలకు లేని నిబంధనలు స్వామి వారికి మాత్రమే ఎందుకూ అని ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: