వంద దాటిపోయింది పెట్రోల్ ..వంద‌కు చేరువ‌లో డీజిల్.. వీటిపై మాట్లాడినా, మాట్లాడ‌క‌పోయినా మోడీ మాత్రం క‌ద‌ల‌డు, మెద‌ల డు, అద‌ర‌డు, బెద‌రడు. వ‌రుస‌గా ఛార్జీల బాదుడు ఓ వైపు, ఇంధ‌న ధ‌రవ‌ర‌ల పెంపు మ‌రో వైపు.ఇవ‌న్నీ ప‌ట్టించుకునే టైం మోడీ కి లేదు. ఇంకా చెప్పాలంటే ఆ పాటి బాధ్య‌త ఆర్థిక మంత్రి కి కూడా లేదు. ఇంకా చెప్పాలంటే..దేశాన్ని న‌డిపే శ‌క్తులు చాలా రోజుల నుంచి బాధ్య‌తారాహిత్యంగా ఉంటున్నాయి. దీంతో క‌ల్లోలిత వాతావ‌ర‌ణం ఒక‌టి ఆర్థిక రంగాన్ని  కుదిపేస్తోంది. ఇలాంటి తుఫాను గ‌తంలో వ‌చ్చిందో లేదో కానీ ఇక‌పై మాత్రం రాకూడ‌దు. ఆర్థిక రంగాన్ని పూర్తిగా నామ రూపాల్లేకుండా చేయాల‌న్న త‌లంపుతోనే మోడీ స‌ర్కారు ఉందా?

పెరుగుతున్న ధ‌ర‌ల కార‌ణంగా మోడీ ప్ర‌తిష్ట రోజురోజుకూ దిగ‌జారుతోంది. ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోని తీరులో మోడీ ఉండడంతో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త వివాదాలు వ‌చ్చిప‌డుతున్నాయి. అయినా కూడా మోడీ స‌ర్కారు దేశం కోసం..ధ‌ర్మం కోసం అన్న నినాదంతో ప్ర‌జ‌ల‌కు తీపి మాట‌లు పంచుతూనే ఉన్నాడు కానీ కారం ప‌నులు చేస్తూనే ఉన్నాడు. ఈ తీపి ఆ కారం తీరెలా ఉన్నా వచ్చే ఎన్నిక‌ల్లో నిర‌స‌నల వేడి మాత్రం మోడీ స‌ర్కారును తాక‌క మాన‌వు. ఇంత‌గా దిగ‌జారిన ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భార‌త్ ఉండేందుకు లేదా భార‌త్ ను ఉంచేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న మోడీ చివ‌ర‌కు ఏం సాధిస్తాడు. దేశం ప్ర‌గ‌తి ప‌థంలో పరుగులు తీస్తుంది అని చెప్పి, రోజురోజుకూ నెత్తిన ధ‌రల మంట ఒక‌టి పెట్టి చోద్యం చూస్తున్న మోడీ ఈ సారి మ‌రింత విఫ‌లం అయ్యారు. రెండో సారి బీజేపీ స‌ర్కారు కేంద్రంలోకి వ‌చ్చాక వ‌రుస‌గా పెట్రో, డీజిలు, గ్యాస్ ధ‌ర‌లు పెంచుకుంటూ పోతున్నారే త‌ప్ప వాటికో నియంత్ర‌ణ అన్న‌ది లేకుండా పోతోంది. దీంతో ధ‌ర‌ల పెరుగుదల‌, ద్ర‌వ్యోల్బ‌ణం అన్న‌వి ప్ర‌తిసారీ క‌నిపిస్తున్న విష వ‌ల‌యాలే!



దేశాన్ని బాగు చేసే శ‌క్తులు చేయాల్సిన ప‌నులు మాత్రం ఇవి కావు. కానీ వారు ఇవేవీ ప‌ట్టించుకోరు. ఇప్ప‌టికే జీఎస్టీ పేరిట ప‌న్నుల బాదుడు ఎలానూ ఉంది. ఇక మిగిలిన రంగాల్లోనూ ప్ర‌యివేటు శ‌క్తుల చొర‌బాటు కూడా ఇదే విధంగా ఉంది. దేనినీ నియంత్రించ‌లేక, అమ్ముకోవ‌డం ఒక్కటే ఆదాయ వ‌నరుగా, ధ‌ర‌లు పెంచుకోవ‌డం అన్న‌ది ఒక్క‌టే ప‌ర‌మావ‌ధిగా మోడీ ఉన్నారు. దీంతో సామాన్యుల జీవ‌నం భారం అవుతోంది. నెల నెల‌కూ నిత్యావ‌స‌ర స‌ర‌కులు ధ‌ర‌లు చుక్క‌లు చూపిస్తున్నాయి.చిన్న, చిన్న ఉద్యోగాలు చేసుకుని బ‌తికే బ‌డుగు జీవులు ఈ ఆర్థిక భారం మోయ‌లేం అని క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: