ప్రకృతి ప్రసాదంగా ఉన్న కేరళ రాష్ట్రం ఇప్పుడు చివురుటాకులా వణుకుతోంది. భూతల స్వర్గం... భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. అతి భారీ వర్షాలతో వందల గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వందల మంది గల్లంతయ్యారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలోని అన్ని నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగుతున్నాయి. ఏకధాటి వర్షాలకు అన్ని కాలువలు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొన్ని చోట్ల... బురద ప్రవాహం గ్రామాలను ముంచెత్తుతోంది. వరదల వల్ల ఇప్పటికే 20 మంది వరకు మరణించినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో నిరాశ్రయులు తలదాచుకుంటున్నారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుంభవృష్టి కురుస్తోంది. గ్రామాలకు గ్రామాలకు జలమయమయ్యాయి.

వరద ప్రవాహం దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణీ ప్రభావంతో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. వాతావరణ శాఖ అధికారుల అంచనాలకు మించి వర్షాలు కురుస్తుండటంతో... పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తేయాకు తోటలు, పర్వత శ్రేణులు ఎక్కువగా ఉండే కొట్టాయం, ఇడుక్కి, పథనం థిట్ట జిల్లాల్లో ఇప్పటికే రికార్డు వర్షపాతం నమోదవుతోంది. వరద ప్రభావంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటి మునిగిపోయాయి. అళప్పుజ, ఎర్నాకుళం, త్రిశూర్, మళప్పురం, కొల్లం, పాలక్కాడ్ జిల్లాలో పరిస్థితి దారుణంగా తయారైంది. సరిగ్గా రెండేళ్ల క్రితం 2018, 2019 ఏడాదుల్లో కూడా ఇదే తరహా వరదలు మళయాళీలను వణికించాయి. భారీ వరద కారణంగా ఇప్పటికే పలు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడి రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: