కళా వెంకట్రావు...ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు...దశాబ్దాల పాటు తెలుగుదేశంలో పనిచేస్తూ వస్తున్న నాయకుడు. మధ్యలో ప్రజారాజ్యంలోకి వెళ్ళిన...మళ్ళీ వెంటనే టి‌డి‌పిలోకి వచ్చేశారు. పార్టీ మారి వచ్చినా సరే కళాకు చంద్రబాబు మంచి పొజిషన్ ఇస్తూనే వచ్చారు. 2014 తర్వాత ఏపీ టి‌డి‌పి అధ్యక్షుడు పదవి ఇచ్చారు...అలాగే మంత్రి పదవి కూడా ఇచ్చారు.

కానీ ఈ రెండు పదవులకు కళా సరిగా న్యాయం చేయలేదనే చెప్పాలి. టి‌డి‌పి అధ్యక్షుడుగా పార్టీకి కళా చేసింది ఏమి లేదు. అయితే చంద్రబాబు, లోకేష్‌లు ఉండటంతో కళాకు అధ్యక్ష బాధ్యతలు నామమాత్రంగానే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే మంత్రిగా కూడా కళా పెద్దగా రాణించలేకపోయారు. ఇదేగాక ఎమ్మెల్యేగా కూడా కళా ఫెయిల్ అయ్యారు. అందుకే 2019 ఎన్నికల్లో ఎచ్చెర్లలో కళా ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు. వైసీపీ నేత కిరణ్ కుమార్ చేతిలో 18 వేల ఓట్ల మెజారిటీ తేడాతో ఓడిపోయారు.

అయితే ఓడిపోయాక అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. అటు ఎమ్మెల్యేగా కిరణ్ కుమార్ దూకుడుగా ముందుకెళుతున్నారు. ఇక మధ్యలో కళా అధ్యక్ష పదవి కూడా పోయింది. ఆ తర్వాత నుంచి మరింతగా కళా వీక్ అయ్యారు. నియోజకవర్గంలో అనుకున్న మేర పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేయలేకపోతున్నారు. దీనికి తోడు ఎచ్చెర్ల టి‌డి‌పిలో గ్రూప్ తగాదాలు పెరిగాయి. ఇక్కడ కలిశెట్టి అప్పలనాయుడుకు సెపరేట్ గ్రూప్ ఉంది. ఇలా గ్రూప్ రాజకీయం చేస్తున్న కలిశెట్టిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. కానీ కలిశెట్టి టి‌డి‌పి జెండా పట్టుకుని పనిచేస్తున్నారు.

నియోజకవర్గంలో ఉన్న టి‌డి‌పి నేతలు, కార్యకర్తలు సైతం కలిశెట్టికి మద్ధతుగా ఉంటున్నారు. అంటే ఎచ్చెర్ల టి‌డి‌పి రెండుగా చీలిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పరిస్తితి వైసీపీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్‌కు కలిసొస్తుంది. వచ్చే ఎన్నికల్లో కళాని గ్రూప్ తగాదాలే కొంప ముచేలా ఉన్నాయి. ఏదేమైనా మళ్ళీ కళాకు ఛాన్స్ వచ్చేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP