విష్ణు, ప్ర‌కాశ్ రాజ్..ఈ ఇద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేది ఎవ‌రు? మోహ‌న్ బాబుకు న‌చ్చ‌జెప్పి గొడ‌వ‌లు వ‌ద్దు అని హిత‌వు ప‌లికే ది ఎవ‌రు? ఇవే ప్ర‌శ్న‌లు గ‌త కొద్ది కాలంగా న‌డుస్తున్నాయి. ప‌లు విధాల చ‌ర్చ‌కు తావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో నిన్న‌టి విష్ణు ప్ర‌మాణ స్వీకారానికి ప్ర‌కాశ్ రాజ్ మ‌నుషులే కాదు  చిరు మ‌నుషులు ఇంకా చెప్పాలంటే ఏ సీనియ‌ర్ న‌టుడూ హాజ‌రుకాలే దు. ఇదే సంద‌ర్భంలో తాను అంద‌రినీ క‌లుపుకుని పోతాన‌ని, ఏపీ సీఎంను సైతం క‌లిసి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని విష్ణు చెబుతుండ‌డం విశేషం. ఏదేమైన‌ప్ప‌టికీ ఇప్ప‌ట్లో ఈ త‌గాదాలు ముగిసిపోతాయ‌ని, మా అసోసియేష‌న్ పూర్వ ప్రాభ‌వంతో ప‌నిచేస్తుంద‌ని అనుకోవ‌డం వింత‌ల్లో కెల్లా వింత.




మూవీ ఆర్టిస్టుల అసోసియేష‌న్ గొడ‌వ ఇంకా ఉంది. ఇప్ప‌టికైతే స‌మ‌సి పోలేదు. ఎన్నిక‌లు అయి వారం కూడా కాలేదు అప్పుడే రెండు ప్యానెళ్ల స‌భ్యులూ నువ్వెంత అంటే నువ్వెంత అన్న త‌ర‌హాలో ఒక‌రినొక‌రు తిట్టుకుంటున్నారు. బాహాబాహీ యుద్ధాల‌కు సైతం సిద్ధం అవుతున్నారు. దీంతో రెండు ప్యానెళ్ల‌కూ ప‌లు స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నాయి. వివాదానికి సంబంధించి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో చోటు చేసుకున్న ప‌రిణామాల‌కు సంబంధించి మా అసోసియేష‌న్ పెద్ద‌గా మాట్లాడ‌డం లేదు. కానీ ప్ర‌కాశ్ రాజ్ మాత్రం త‌న‌కు ఆ రోజు (పోలింగు రోజు) రికార్డు అయిన సీసీ టీవీ ఫుటేజ్ కావాల‌ని ప‌ట్టుప‌డుతున్నారు. అయితే ఇది ఇచ్చేందుకు త‌న‌కు అధికారం లేద‌ని ఎన్నిక‌ల అధికారి కృష్ణ మోహ‌న్ చెబుతున్నారు.



ఈ నేప‌థ్యంలో సీసీ టీవీ ఫుటేజ్ రికార్డు రూమ్ కు పోలీసులు తాళాలు వేశారు. ఇప్పుడు మా అసోసియేష‌న్ లో గొడ‌వ‌లు ఇంకొన్ని రూపాల‌లో మార‌బోతున్నాయి. ఎన్నిక‌ల రోజు జ‌రిగిన అక్ర‌మాల‌పై ప్ర‌కాశ్ రాజ్ కోర్టుకు వెళ్లనున్నారు. ఇదే స‌మ‌యంలో సీసీ టీవీ ఫుటేజ్ అన్న‌ది కీల‌కం కానుంది. దీనిని మోహ‌న్ బాబు మ‌నుషులు మాయం చేస్తార‌న్న అనుమానాలు ప్ర‌కాశ్ రాజ్ వ్య‌క్తం చేస్తూ  వ‌స్తున్నారు. మ‌రోవైపు విష్ణు ప్ర‌మాణ స్వీకారోత్స‌వ వేళ మోహ‌న్ బాబు కొన్ని శాంతి వ‌చ‌నాలు ప‌లికారు. కానీ అవేవీ న‌మ్మ‌శ‌క్యంగా లేవ‌ని, వాటిని తాము వినిపించుకునే స్థితిలో లేమ‌ని ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఎన్నికైన కార్య‌వ‌ర్గం చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa