ఈ నెల 30న జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలు తెలంగాణలో కాక రేపుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా ఉప ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పేరుకే నోటిఫికేషన్ ఈ నెలలో వచ్చినప్పటికీ... దాదాపు మూడు నెలలుగా అన్ని పార్టీలు కూడా హుజురాబాద్ ఉప ఎన్నిక పై దృష్టి సారించాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా హుజురాబాద్ లో మాజీ మంత్రి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఓడించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ... అన్ని పార్టీల కంటే ముందే తమ అభ్యర్థిగా శ్రీనివాస్ గౌడ్ రంగంలోకి దించింది. అలాగే శ్రీనివాస్ గెలుపు కోసం టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా పేరున్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు హుజురాబాద్ ఎన్నిక బాధ్యత కెసిఆర్ అప్పగించారు. అలాగే హుజురాబాద్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక దళిత బంధు పథకాన్ని కూడా హుజురాబాద్ నుంచి అమలు చేస్తోంది.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఏదైనా ఓడించాలని గట్టి పట్టుదలతో ఉన్న కేసీఆర్... స్వయంగా తానే రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 30న ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ తేదీ కి సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం ముగించాలి అనేది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం. అంటే ఈనెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ప్రచారం ముగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన హుజురాబాద్ సమీపంలోని హుస్నాబాద్ లేదా ముల్కనూర్ లో లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు ఈ సభ ద్వారా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధ్యక్ష ఎన్నికపై కూడా ఓ క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష  ఎన్నికల షెడ్యూలు విడుదలయింది. 22 వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చేనెల 15వ తేదీన వరంగల్ లో తెలంగాణ విజయ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఇది ద్వి దశాబ్ది ఉత్సవాలతో పాటు అటు హుజురాబాద్ ఎన్నికలు కూడా ఉండడంతో.. ఈనెల 27వ తేదీన కరీంనగర్ జిల్లాలో పర్యటించి భారీ బహిరంగ సభ నిర్వహించాలనేది కెసిఆర్ మెగా ప్లాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: