ఆఫ్ఘనిస్తాన్ కు మిత్ర దేశం పాకిస్తాన్ షాక్ ఇచ్చింది. తాలిబన్ల అతి జోక్యంతో విసుగొచ్చి ఆఫ్గాన్ కు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు గా ప్రకటించింది. టికెట్ రేట్లు తగ్గించే పరిస్థితే లేదని తేల్చేసింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఓ ప్రకటన జారీ చేసింది. దీంతో ఆఫ్గాన్ కు ప్రస్తుతం నడుస్తున్న ఏకైక విదేశీ విమానయాన సర్వీస్ కూడా నిలిచిపోయినట్లయింది. తాలిబాన్ల పాలన లో ఉన్నా ఆఫ్గన్ సరిహద్దులు దాటడానికి ఉన్న ఒక్క దారి కూడా మూసుకుంది. తాలిబన్ల దురాక్రమణకు ముందు అంటే ఆగస్టు 15 వరకు కాబోల్, ఇస్లామాబాద్ మధ్య విమాన ఛార్జి టికెట్ ధర 120 నుంచి 150 డాలర్ల మధ్య ఉండేది. కానీ ఇప్పుడు అది 2500 డాలర్లకు చేరుకుంది.

 ఈ తరుణంలో టికెట్ ధరల్ని తగ్గించాలని లేదంటే విమాన సర్వీసుల్ని నిలిపివేస్తామని తాలిబన్ ప్రభుత్వం పాకిస్తాన్ను హెచ్చరించింది. ఇందుకు కౌంటర్ గా పాక్ తమ సర్వీసులను నిలిపివేసి తాలిబాన్ లకు ధీటుగా బదులిచ్చింది. తమ సిబ్బంది పట్ల దురుసుగా  వ్యవహరిస్తున్న తాలిబన్లను  ఇంతకాలం ఓపికగా భరిస్తూ వస్తున్నామని చెబుతుంది పిఐఏ. అయితే ఇప్పుడు మునుపటి ధరలతో విమాన సర్వీసులను నడపాలి అన్నది తాలిబన్ల తాజా ఆదేశం. కానీ బీమా సంస్థలు కాబోల్ ను యుద్ధ ప్రాంతంగా పరిగణిస్తున్నందున భీమా ప్రీమియం ధరలు భారీగా పెరిగాయని అందుకనే టికెట్ల ధరలు పెంచాల్సి వచ్చిందని పాక్ చెబుతుంది. ఇంతకాలం తాము మానవతా దృక్పథ కోణంలోనే విమాన సర్వీసులు నడపామని కానీ ఇక మీదట టిక్కెట్ ధరలను తగ్గించ లేమని ఆఫ్ఘనిస్తాన్ కు విమాన సర్వీసులు రద్దు చేసింది పి ఐ ఏ. తాలిబన్లు చివరి నిమిషంలో  ప్రయాణ నిబంధనలను మార్చడం, అనుమతులపై ఆంక్షలు విధించడం, సిబ్బంది ని ఇబ్బంది పెట్టడం చేశారని పాక్ ఎయిర్లైన్స్ ఆరోపిస్తోంది. కొద్ది రోజుల క్రితం భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కమర్షియల్ విమాన సేవలు పునరుద్ధరించాలని ఆఫ్గాన్ సర్కార్ కోరింది. ఖతర్ సాంకేతిక సాయంతో కాబోల్ విమానాశ్రయాన్ని పునరుద్ధరించామని కూడా తెలిపారు. అయితే ఆ దేశానికి పాక్ తప్ప మరే దేశం విమానాలు నడపడం లేదు. ఇప్పుడు ఆ సర్వీస్  కూడా ఆగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: