బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ విభాగం తెలిపింది. తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ రోజు, రేపు.. కోస్తా, రాయలసీమల్లో జోరు వానలు పడతాయని వెల్లడించింది.ఈ అల్పపీడనాల వల్ల ద్రోణులు సముద్ర మట్టానికి 5.8కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్టు పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.

మరోవైపు వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారి, భారీ వర్షాలు కురిస్తే హైదరాబాద్ నగరం మునిగిపోతుందని బిట్స్ పిలానీ సైంటిస్టులు వెల్లడించారు. ఏకధాటిగా 17రోజుల పాటు 440.35మిల్లీమీటర్ల వర్షం పడితే ప్రమాదకర పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. సుమారు 625చదరపు కిలోమీటర్ల ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సగభాగం అంటే 334 చదరపు కిలోమీటర్లు మునిగిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. అనాలసిస్ సిస్టమ్ 2డీ టెక్నాలజీ ద్వరా ఈ సర్వే చేశారు.

2018లో వచ్చిన వరద విలయాన్ని మరవకముందే కేరళపై ప్రకృతి మరోసారి పగబట్టింది. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు పట్టణాలు మునిగిపోయాయి. వందల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. కొట్టాయం, పథానంతిట్ట, ఇడుక్కి జిల్లాలో భారీ నష్టం సంభవించింది. సహాయక చర్యల కోసం సైన్యం రంగంలోకి దిగింది. అక్టోబర్ 7 నుండి 13తేదీల మధ్య కేరళలో 166శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.

కేరళలో భారీ వర్షాలు, వరద పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. నిరంతరం కేరళ పరిస్థితి గురించి వివరాలు తెప్పించుకుంటున్నానని తెలిపారు. ఆ రాష్ట్రానికి కావాల్సిన అన్ని రకాల సహాయసహకారాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. అందరూ సురక్షితంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు అమిత్ షా తెలిపారు. ఈ వర్షాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: