జగన్ తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నారు. ఆయనకు ఎపుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఆయన రాజకీయం పూల పానుపు అసలు కాదు, ఎంతో కష్టపడితే వచ్చిన ముఖ్యమంత్రి పదవి అది. అందువల్ల జగన్ తనకేంటి మేలు చేస్తుందో రాష్ట్రానికి ఏమి చేస్తుందో కూడా బాగా తెలుసు.

మరి అటువంటి జగన్ కి తాను మంచి స్నేహితుడిని అంటూ కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చెప్పుకున్నారు. తాజాగా ఆయన విశాఖ టూర్ లో జగన్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. జగన్ ఏపీకి మేలు చేయాలి అనుకుంటే తక్షణం ఎన్డీయేలో చేరాల్సిందే అంటూ మంచి సలహా ఇచ్చారు. జగన్ చేరడం వల్ల కలిగే లాభాలు ఏంటో కూడా ఆయన వివరించారు. ఏపీలొ రోడ్లు, ప్రాజెక్టులు నిధులు ఇలా అభివృద్ధి అంతా కూడా చాలా చక్కగా సాగుతుంది అని కూడా ఆయన ఊరించారు.

జగన్ కనుక సరేనంటే తాను వెళ్ళి ప్రధాని మోడీతో అమిత్ షాతో మాట్లాడుతానని కూడా అభయం ఇచ్చేశారు. మరి జగన్ కి నేరుగా మోడీతోనే అనుబంధం ఉంది. అలాగే అమిత్ షా దగ్గర చనువు ఉంది. మరి జగన్ చేరాలి అనుకుంటే ఇంత లేట్ గానా. రెండున్నరేళ్ళకు ముందే ఆయన చేరడం ఖాయం. అయితే జగన్ బీజేపీకి దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఆయన ఆలోచనలు ఆయనకు ఉన్నాయి. రాందాస్ చెప్పినట్లుగా జగన్ చేరితే కేంద్రం నుంచి నిధులు దండీగా రావచ్చు. కానీ జగన్ రాజకీయం మాత్రం పూర్తిగా మారిపోతుంది. 2019 ఎన్నికల వేళ చంద్రబాబుకు జరిగిన పరాభవమే జగన్ కి జరుగుతుందని భయం ఉంది. అందుకే ఆయన ఆలోచిస్తున్నారు అంటున్నారు. మొత్తానికి మంచి స్నేహితుడిని అంటూనే జగన్ని రాం దాస్ ఇరికించేశారు. దీని వల్ల జగన్ కి రాజకీయమే ముఖ్యమని ఎవరైనా అనుకుంటే తప్పు రాం దాస్ ది కాదేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: