హుజురాబాద్‌ ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఒంటరి అయ్యారన్న చర్చ జోరుగా సాగుతోంది.అటు బీజేపీ పెద్దలు రాక, ఇటు అనుచరులు లేక ఈటల రాజేందర్‌ దంపతులు ప్రచారం చేసుకుంటున్నారని, ఈటలను ఒంటరి చేయడంలో అధికార టీఆర్ఎస్‌ సక్సెస్‌ అయిందని రాజకీయ వర్గాల వారు అంటున్నారు. పోలింగ్‌ దగ్గర పడుతున్నా బీజేపీ పెద్దలు హుజురాబాద్‌కు ఎందుకు రావడం లేదని చర్చించుకుంటున్నారు.

నిజానికి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత.. హుజురాబాద్‌కు ఆ పార్టీ పెద్దలు ఇన్‌చార్జిలను కూడా నియమించారు. ఉప ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై కమిటీలు కూడా వేశారు. అయితే గడిచిన రెండు నెలలుగా హుజురాబాద్‌లో బీజేపీ ఇన్‌ఛార్జిలు పెద్దగా పర్యటించిన దాఖలాలు లేవు. ఆ పార్టీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ ధర్మపురి అరవింద్ ఒకట్రెండు సార్లు మాత్రమే వచ్చి వెళ్లారు. ఇక దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా వేళ్లపై లెక్కపెట్టినన్ని సార్లే వచ్చి వెళ్లారు. హుజురాబాద్ నియోజకవర్గ ఉపఎన్నికల పార్టీ ఇన్‌ఛార్జ్‌ జితేందర్‌రెడ్డి మాత్రం అక్కడే ఉంటున్నారు. కానీ ఆయన పెద్దగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మరోవైపు కరీంనగర్ ఎంపీ, ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కూడా ఒకట్రెండు సార్లు మాత్రమే హుజురాబాద్‌లో పర్యటించారు.. ఆయన తన పాదయాత్ర ముగించినప్పటికీ హుజురాబాద్‌కు రాలేదు. అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో చివరి ఐదు రోజులు రోజుకో మండలంలో బండి సంజయ్‌ ప్రచారం చేస్తారని అంటున్నారు ఆ పార్టీ నేతలు. తొలి విడత పాదయాత్ర ముగిసిన తర్వాత హుజురాబాద్ లో బండి సంజయ్ శంఖారావం పూరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ నామినేషన్ సందర్భంగా వచ్చి వెళ్లారు. ఆ తర్వాత ఆయనతోపాటు మిగతా నేతలెవరూ అటు వైపు కూడా చూడటం లేదు.

 బీజేపీ పెద్దలు వచ్చినా, రాకపోయినా ఈటల రాజేందర్, ఆయన సతీమణి జమున మాత్రం తమ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో దంపతులు ఇద్దరే ప్రచారం చేసుకోవడాన్ని బట్టే చూస్తే ఈటల రాజేందర్ ఒంటరి అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఈటల అనుచరులు, సన్నిహితులు అందర్నీ టీఆర్‌ఎస్‌ తన వైపు తిప్పుకుంది. ఆయన దగ్గర ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ నేతలను లేకుండా చేశారు మంత్రి  హరీష్ రావు. బీజేపీలో ఉన్న పాత క్యాడర్ కూడా ఈటల రాజేందర్‌కు సపోర్టు చేయడం లేదు. కేవలం ఆయన వెంట ఉన్న వారే అడపాదడపా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ నెల 20 తర్వాతే హుజురాబాద్‌లో బీజేపీ నేతల పర్యటనలు ఉంటాయని తెలుస్తోంది. మిగిలిన వారం రోజులు మెరుపు వేగంతో ప్రచారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదిఏమైనా ఇన్నాళ్లు ఈటల రాజేందర్‌కు మద్దతుగా బీజేపీ ముఖ్య నేతలు ప్రచారానికి రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: