కరోనా వాక్సిన్ భారతదేశంలో పూర్తిగా అందుబాటులోకి వచ్చాక వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. కేంద్రం వాక్సిన్ ఉచితంగానే అందిస్తుండటంతో రాష్ట్రాలకు కాస్తంత ప్రయోజనంగానే ఉంది. వాక్సినేషన్ కు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు వాక్సిన్ ను కేంద్రం ఉచితంగానే సరఫరా చేస్తోంది. ప్రత్యేకంగా మెడికల్ సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి వాక్సిన్ వేయిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ దేశం మొత్తం వాక్సినేషన్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసి.. అందుకు అనుగుణంగా పనిచేస్తున్నారు.

కరోనా వాక్సినేషన్ లో ఉత్తరాఖండ్ రికార్డు సృష్టించింది. అర్హత ఉన్న ప్రజలకు నూటికి నూరు శాతం వాక్సిన్ వేయించింది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ తొలి డోసుని పూర్తి చేసింది.  విషయాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. ఆదివారంతో రాష్ట్రంలో అర్హులైన ప్రతీఒక్కరికీ కరోనా టీకా మొదటి డోసును అందించినట్టుగా పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు సహకరించిన ప్రధాని నరేంద్రమోదీకి రాష్ట్ర ప్రజల తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనుకున్న లక్ష్యాన్ని మూడు  నెలల ముందుగానే సాధించామని చెప్పుకొచ్చారు.  ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొత్తం 74 లక్షలమందికి తొలివిడత వాక్సిన్ వేసినట్టు తెలిపారు సీఎం పుష్కర్ సింగ్ ధామి.  

భారత దేశం మొత్తం వాక్సినేషన్ ఉచితంగానే అందిస్తున్నా, ఇప్పటికీ చాలామంది వాక్సిన్ వేసుకోవాలంటే ఎందుకో ఆసక్తి చూపడం లేదు. కొందరు తొలివిడత డోసు వేసుకున్నా.. రెండవ విడత డోసు వేసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అయితే భాద్యతగా కొందరు మాత్రం రెండు డోసులను వేయించుకున్నారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే చాలాచోట్ల నిబంధనలు సడలించారు. దీంతో ప్రజలంతా పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు అంటూ గంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాక్సినేషన్ టార్గెట్లు పూర్తి కావడం కొంత ఊరట కలిగించే అంశం. ఉత్తరాఖండ్ లాగానే దేశం మొత్తం వాక్సినేషన్ పూర్తయితే కొంతవరకూ కరోనాను కట్టడి చేసినట్టే. తొలి డోసుతోపాటు, మలి డోసు కూడా వేయడంలో ఉత్తరాఖండ్ స్పీడ్ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: