ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది.. ఓ దుర్మార్గుడు ఓ వివాహితపై కన్నేశాడు. ఎలాగైనా కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. అందుకు తనకు వచ్చిన భూతవైద్యాన్ని వాడుకున్నాడు.. మాటల్లో మాట కలిపి ఆమె ఆరోగ్య సమస్య తెలుసుకున్నాడు. ఇంకేం.. నేను బాగు చేస్తాను కదా.. అని ఇంటికి తీసుకెళ్లాడు.. అదను చూసి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.. కాస్త బలవంతం చేస్తే ఆమె సహకరిస్తుందని భావించాడు.. కానీ.. అనూహ్యంగా ఆమె తిరగబడింది. ఎదురుతిరిగింది.


దీంతో ఏం చేయాలోఅర్థం కాని ఆ దుర్మార్గుడు ఆమె కాళ్లు చేతులు కట్టేశాడు.. ఆమెను వదిలితే ఊళ్లోకి వెళ్లి తన అత్యాచారం విషయాన్ని గ్రామస్తులకు చెబుతుందని భయపడిపోయాడు. అంతే.. ఆ భయంతో ఏకంగా ఆమెను గొడ్డలి తీసుకుని నరికేశాడు.. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక జుట్టుపీక్కున్నాడు. భయం భయంగా కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పాడు.. వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైద్యం పేరుతో నమ్మించి ఇలా అత్యాచార యత్నం చేసిన దారుణం.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో జరిగింది.


సమాచారం అందుకుని గ్రామానికి వచ్చి నిందితుడు ఓబయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలికి వచ్చిన ఎస్సై రజియా సుల్తానా బేగం ఓబయ్యను తన వాహనంలో ఎక్కించుకుని స్టేషన్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడే మరో దారుణం జరిగింది. బాధితురాలిని దారుణంగా చంపిన విషయం తెలుసుకున్న కామేపల్లి గ్రామస్థులు ఆవేశంతో ఊగిపోయారు. పోలీసు జీపులో కూర్చున్న ఓబయ్యను బయటకు లాగి కర్రలతో తీవ్రంగా కొట్టారు. అడ్డుకున్న ఎస్సై పైనా దాడికి దిగారు.


బాగా కోపంగా ఉన్న గ్రామస్తుల దెబ్బలకు ఓబయ్య కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వరుస ఘటనలతో జరుగుమల్లి మండలం ఉలిక్కిపడింది. ఎస్సై ఇచ్చిన సమాచారంతో ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. అదనపు సిబ్బందిని పంపి గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితుడికి భూతవైద్యం చేసే అలవాటు కూడా ఉండటంతో అత్యాచారం కోసమే ప్రయత్నించాడా...లేక క్షుద్రపూజల కోసం ప్రయత్నించాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: