2019 ఎన్నికలలో ఏపీలో వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన ఎవరికి వారే విడివిడిగా పోటీ చేశారు. ఈ నాలుగు పార్టీల మధ్య పొత్తులు కూడా లేవు. వచ్చే ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఒంటరిగానే పోటీ చేసే అవకాశం ఉంది. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే టీడీపీ తరపున సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది. దాదాపు 50శాతం సీట్లను బీజేపీ, జనసేనకు చంద్రబాబు త్యాగం చేస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ గాసిప్ చక్కర్లు కొడుతోంది. అయితే కిందిస్థాయిలో బలమైన క్యాడర్ ఉండే టీడీపీ, ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా.. లేదా అనేది ఇప్పుడు అసలు సమస్య..

ఏపీలో ఇప్పుడు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే ప్రధానంగా జనసేన పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రతిపక్ష పాత్రను టీడీపీ నుంచి హైజాక్ చేసే ప్రయత్నంలో ముందుంటోంది. రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై స్పందిస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తూ వెళ్తున్నారు పవన్.. ఇక జనసైనికులు కూడా తమవంతుగా సేనానికి అండగా ఉంటూ, వైసీపీ నేతలకు కౌంటర్లు ఇచ్చే పనిలో ఉన్నారు. ఇలా జనసేన దూకుడు మీదున్న నేపథ్యంలో టీడీపీ మాత్రం సైలెంట్ గా ఉంటోంది.
ఈ సైలెంట్ ను బట్టి చూస్తే.. చంద్రబాబు రానున్న ఎన్నికలలో జనసేనతో కలుస్తారనే వాదనకు బలం చేకూరుతోంది.

అయితే ఎన్నికలలో కలిసి పోటీ చేయడమంటే మామూలు విషయం కాదు. సీట్ల సర్దుబాట్లు, బుజ్జగింపులు, ఫిరాయింపులు ఇలా అనేక తలనొప్పులు మొదలవుతాయి. అయినా ఇప్పటికిప్పుడు తమ సీటును వేరొకరికి కేటాయిస్తే.. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జుల పరిస్థితి ఏమిటన్నది కూడా ఆలోచించాల్సిన విషయం.. అసలు చంద్రబాబు కలిసి పోటీ చేద్దామనే ఈ ప్రతిపాదన పెడితే, ఎంతమంది టీడీపీ నేతలు ఒప్పుకుంటారనేది కూడా సందేహమే.. ఒకవేళ పొత్తుకు అంగీకరించినా బీజేపీ, జనసేన అభ్యర్థుల తరపున ఎంతమేర పని చేస్తారనేది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అంతగా టీడీపీలో సీట్లు త్యాగం చేసే త్యాగరాజులు ఉన్నారా..  అనే విషయంపై కూడా రానున్న రోజుల్లోనే క్లారిటీ వస్తుంది. ఒకవేళ చంద్రబాబు సీట్ల త్యాగానికి ఒప్పుకున్నా.. పార్టీ బలహీన పడుతుందని అంటున్నారు విశ్లేషకులు. గతంలో వామపక్షాలు, బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నా.. నామ మాత్రంగా వారికి సీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు టీడీపీ పరిస్థితి కూడా దారుణంగా ఉంది కాబట్టి.. మిత్రపక్షాల డిమాండ్లు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ పొత్తులు ఖరారైతే.. వాటిని బాబు ఎంతవరకు నెరవేరుస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: