విశాఖ మ‌న్యం దేశ వ్యాప్తంగా కొన్ని చోటుచేసుకుంటున్న వివాదాల‌కే కాదు నేరాల‌కూ కేంద్ర బిందువు అవుతోంది. ఇక్క‌డి గంజాయి సాగు, ర‌వాణా అన్న‌వి ప‌లు కీల‌క నేరాల‌కు కార‌ణం అవుతున్నాయి.అయినా కూడా నియంత్ర‌ణ లేదు. నిఘా ఉన్నా  కూడా ఫ‌లితం లేదు. స్థానికులే ఈ చ‌ర్య‌ల‌కు కార‌కులు..మ‌ద్ద‌తుదారులు కూడా! 

జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక విశాఖ గంజాయి కేసు వెలుగులోకి వ‌చ్చింది. గ‌తంలోనూ ఇలాంటి కేసులే వెలుగులోకి వ‌చ్చినా అవేవీ ప‌ట్టింపులో లేకుండా పోయాయి. విశాఖ మ‌న్యంలో భారీ ఎత్తున సాగ‌వుతున్న గంజాయి, ఎన్నో వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారిపోతోంది. వేల కోట్ల రూపాయ‌లు చేతులు మారుతుండ‌డంతో వీటిని అడ్డుకోవ‌డం అన్న‌ది అస్స‌లు జ‌రిగే ప‌ని కాద‌ని తేలిపోతోంది. పోలీసుల‌కు స్మ‌గ్ల‌ర్ల‌ను ప‌ట్టుకోవ‌డం ఇంకా త‌ల‌నొప్పిగానే  ఉంది. నిన్న‌టి వేళ న‌ల్గొండ పోలీసుల‌పై గంజాయి గ్యాంగ్ దాడులు చేసింది. ఓ కేసు విష‌య‌మై ఇక్క‌డికి వ‌చ్చిన వారికి చుక్క‌లు చూపించింది. అదేవిధంగా ఆంధ్రా, తెలంగాణ పోలీసుల‌కూ ఈ బ్యాచ్ ఎన్నో స‌వాళ్లు విసురుతోంది. పూర్తిగా స్థానికుల మ‌ద్ద‌తుతో సాగుతున్న వ్య‌వ‌హారం కావ‌డంతో పోలీసుల‌కు నేర‌స్తులు చిక్క‌డం లేదు అన్న‌ది మాత్రం వాస్త‌వం.


విశాఖ మ‌న్యంలో వేల ఎక‌రాల్లో గంజాయి సాగ‌వుతోంది. ఇందుకు ఆధారాలు ఎన్ని ఉన్నా పోలీసులు మాత్రం సంబంధిత వ్య‌క్తుల‌ను ప‌ట్టుకోవడం లేదు. కోట్ల రూపాయ‌ల్లో వ్యాపారం సాగిపోతున్నా ప్ర‌భుత్వాల‌కు ఇవేవీ ప‌ట్ట‌డం లేదు. ఇక్క‌డి నుంచి తెలంగాణ‌కు గంజాయి య‌థేచ్ఛ‌గా ర‌వాణా అయిపోతోంది. ఇంకా ఇత‌ర రాష్ట్రాల‌కూ స‌ర‌కు ర‌వాణా జ‌రుగుతోంది. ముఖ్యంగా ఉత్త‌రాది, ఈశాన్య రాష్ట్రాల‌కూ ఈ ప్రాంతమే పెద్ద దిక్కు అవుతోంది. ఇంత జ‌రుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నార‌ని..వేల కోట్ల రూపాయ‌ల వ్యాపారం సముద్ర మార్గం మీదుగా జ‌రిగిపోతున్నా అడ్డుకునే వారే లేరెందుకని? గంజాయి సాగుదారుల వెనుక రాజ‌కీయ శ‌క్తులు ఉన్నాయా? గ‌తంలోనూ ఇవే శ‌క్తులు వీరికి అండ‌గా ఉండి త‌మ ప‌ని తాము చేసుకునేలా స‌హ‌క‌రించాయా?అన్న అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. అయితే వీటిపై స్ప‌ష్ట‌మ‌యిన స‌మాచారం లేక‌పోవ‌డంతో స్థానిక నాయ‌కులను పోలీసులు ప‌ట్టుకున్నా బ‌డా బాబుల‌పై మాత్రం అస్స‌లు కేసులన్న‌వే లేకుండా చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: