శ్రీకాకుళం జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు వేడెక్కాయి. గ‌తానికి భిన్నంగా.. టీడీపీ నాయ‌కురాలు.. జిల్లా పార్టీ చీఫ్ గౌతు శిరీష దూకుడు చూపిస్తున్నారు. ఏకంగా మంత్రిపైనే ఆమె స‌వాళ్లు రువ్వుతున్నారు. మంత్రి ప‌ద‌విని ప‌క్క‌న పెట్టి.. రావాల‌ని.. త‌నేంటో నిరూపిస్తాన‌ని.. మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుకు శిరీష విసిరిన స‌వాల్‌.. సంచ‌ల‌నంగా మారింది. నియోజ‌క‌వ‌ర్గం లో అభివృద్ది చేస్తున్నామ‌ని.. టీడీపీ నాయ‌కుల‌కు క‌ళ్లాప‌రేష‌న్ చేయాలంటూ.. మంత్రి వ్యాఖ్యానించిన ద‌రిమిలా.. నియోజక‌ వ‌ర్గంలో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య‌.. మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో తాము అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌రిగిన అభివృద్ధి మిన‌హా ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది ఏమీ లేద‌ని.. శిరీష వ్యాఖ్యానించారు..

ఇక‌, అదేస‌మ‌యంలో మంత్రి త‌న వాగ్ధాటిని పెంచారు. తాన‌ను లేక‌పోతే.. నియోజ‌క‌వ‌ర్గాన్ని మ‌రింతగా నాశ‌నం చేసేవారంటూ.. విమ‌ర్శ‌లు గుప్పించారు.. ఈ క్ర‌మంలో శిరీష‌.. మంత్రి త‌న ప‌ద‌విని వ‌దిలి బ‌య‌ట‌కు రావాల‌ని.. అప్పుడు.. త‌నేంటో చూపిస్తానం టూ.. స‌వాల్ రువ్వారు. ఈ ప‌రిణామాలు.. ఇలా సాగుతుంటే.. అటు రాజ‌కీయంగాను.. ఇటు సామాజిక వ‌ర్గాల ప‌రంగానూ.. రాజ‌కీయం వేడెక్కింది. ఆది నుంచి టీడీపీకి బ‌లమైన నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న ప‌లాస‌లో గ‌త ఎన్నికల్లో అనూహ్య విజ‌యం ద‌క్కించుకున్న అప్ప‌ల‌రాజు.. త‌ర్వాత కాలంలో మంత్రి అయ్యారు.

ఇక‌, అప్ప‌టి నుంచి టీడీపీ నుంచి వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తుండ డం.. టీడీపీలో ఆందోళ‌న‌కు దారితీసింది. దీంతో అభివృద్ధి మంత్రం దిశ‌గా టీడీపీ నాయ‌కులు ప‌య‌నిస్తున్నారు. ఈ క్ర‌మంలో యువ నాయ‌కురాలు.. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైన శిరీష‌.. మంత్రిని టార్గెట్ చేశారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రి అప్ప‌ల‌రాజు శిరీష‌కు ప్ర‌తిగా కౌంట‌ర్ ఇచ్చింది లేదు.పైగా.. టీడీపీ పార్టీ అనేది ఉందా? అంటూ.. ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, ఇక్క‌డి క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. మంత్రికి సానుకూలత ఎలా ఉన్నా.. శిరీష ప‌ట్ల సానుబూతి పెరుగుతోంది.

సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చిన ఆమె గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన త‌ర్వాత‌.. కూడా పార్టీలో యాక్టివ్‌గానే ఉన్నారు. చంద్ర‌బాబు పిలుపుతో నిర్వ‌హిస్తున్న ప్ర‌తి కార్య‌క్ర‌మంలోనూ ఆమె దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎలాంటి ఆరోప‌ణ‌లు లేక‌పోవ‌డం.. బ‌ల‌మైన గ‌ళం వినిపించే నాయ‌కురాలుగా గుర్తింపు ఉండ‌డం వంటివి శిరీష‌కు క‌లిసి వ‌స్తున్నాయి. అయితే.. మ‌రింత ఆమె పుంజుకుంటే.. తిరుగులేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: