కాంగ్రెస్ కు నేనే సుప్రీం అంటున్నారు సోనియా. అవును! నిజ‌మే! ఆమే సుప్రీం. కానీ ఆమెతో న‌డిచే వారెవ్వ‌రో అన్న‌ది తేల‌డం లేదు. ఇప్ప‌టికే క‌పిల్ సిబ‌ల్ లాంటి వారు ధిక్కార స్వ‌రం వినిపిస్తున్నారు. అలాంట‌ప్పుడు ఆమె తో న‌డిచేది ఎవ్వ‌రు? ఆమె నాయ‌క‌త్వంకు మద్దతు ఇచ్చేది ఎవ్వ‌రు? ఇప్ప‌టికే ద‌క్షిణాదిలో పార్టీ ఉనికే లేకుండా పోయింది. ప్రాంతీయ పార్టీల  రాక‌తో ఇంకా బ‌ల‌హీన ప‌డింది కాంగ్రెస్. న‌ల‌భై లోక్ స‌భ స్థానాలున్న ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ ను విభ‌జించాక ఎక్క‌డిక‌క్క‌డ కాంగ్రెస్ ప‌ట్టు కోల్పోయింది. తెలంగాణ అవ‌స‌ర‌త‌ను, ఉద్దేశాన్ని వివ‌రించి కేసీఆర్ దూసుకుపోయారు.




తెలంగాణ‌ను ఇచ్చింది మేమే అని కాంగ్రెస్ చెప్పినా ఎవ్వ‌రూ వినిపించుకోలేదు. ఇంటి పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర స‌మితినే అంతా న‌మ్మారు. ఒక  సారి కాదు వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో న‌మ్మారు. రేప‌టి వేళ కూడా గెలుపు మాదే అన్న ధీమా కేసీఆర్ ది. కానీ అంత‌టి ధీమాలో రేవంత్ లేరు. అంత‌టి ధీమాలో ఇత‌ర నాయ‌కులెవ్వ‌రూ లేరు. ఇప్పుడు చెప్పండి సుప్రీంకు చుక్క‌లు చూపిస్తున్న‌దెవ్వ‌రో..! ప‌క్క పార్టీల నుంచి వ‌ల‌స వ‌చ్చిన నేత‌ల‌కు టీపీసీసీ చీఫ్ ప‌గ్గాలు అప్ప‌గించినా పార్టీలో  ఎటువంటి మార్పూ లేదు. పోనీ బాబు(టీడీపీ అధినేత)తో క‌లిసి రాజ‌కీయం చేసినా ఫ‌లితాలు వ‌చ్చేలా లేవు.

 
ఇదే స‌మ‌యంలో ఆంధ్రాలోనూ ఆమెకు చెప్పుకోద‌గ్గ మ‌ద్ద‌తు రాదు. లేదు కూడా! రాష్ట్రాన్ని విభ‌జించే స‌మ‌యంలో ఆనాటి కాంగ్రెస్ నాయ‌కులెవ్వ‌రూ ఇవాళ యాక్టివ్ గా లేరు. ఉన్నా వారంతా జ‌గ‌న్ పార్టీలో ఉన్నారు. జ‌గ‌న్ ను అనేక అవ‌మానాలు గురిచేసిన పార్టీగానే కాంగ్రెస్ ను  చూస్తారే త‌ప్ప, సానుభూతి ప‌రంగా ఎవ్వ‌రూ అనుకూల సంకేతాలు ఇవ్వ‌రు. అంతేకాదు కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ పెట్టుకుని గ‌ట్టి పట్టున్న నేత‌గా జ‌గ‌న్ ఎదిగారు. అందుకే కాంగ్రెస్ కు ఏపీలో మునుప‌టి రోజులు రావు గాక రావు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కూడా మునుప‌టి రోజులు రావు గాక రావు. త‌మిళ‌నాట డీఎంకేతో పొత్తులు కుదురుతాయో లేదో అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేం. క‌ర్ణాట‌కలోనూ, ఇత‌ర ప్రాంతాల‌లోనూ కాంగ్రెస్ నాయ‌కులు పోరాట ప‌టిమ‌ను విడిచి ఉన్నారన్న విమ‌ర్శ కూడా ఉంది. క‌మ్యూనిస్టుల హ‌యాంలో ఉన్న కేర‌ళ‌ను కొట్ట‌డం అంత సులువు కాదు. ఇక ఒక‌నాటి ద‌ళిత ఓటు బ్యాంకు ఎప్పుడో చీలిపోయింది. ఉత్తారాది ద‌ళిత నాయ‌కులు ఎవ‌రి కుంప‌టి వారే రాజేసుకుంటున్నారు క‌నుక సోనియాకు మ‌ద్దతుగా ఎంద‌రు ఉంటారో అన్న‌ది ఇప్ప‌ట్లో తేలే విష‌యం కాదు. ఈశాన్య భారతంలో కూడా కాంగ్రెస్ కు రోజుల్లేవు. స్థానిక పార్టీల హ‌వాలో కాంగ్రెస్ పూర్తిగా నామ‌రూపాలు లేకుండా పోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: