ఉమ్మడి ఆంధ్రాలో ఎంతో పేరున్న పార్టీగా టీడీపీ చ‌రిత్ర‌లో చోటు ద‌క్కించుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ హయాం నుంచి చంద్ర‌బాబు వ‌ర‌కూ అంతా పార్టీని స‌మ‌ర్థంగా న‌డిపించ‌డంతో విజేత‌లు అయ్యారు. స‌మాజ‌మే నా దేవాల‌యం ప్ర‌జ‌లే నా దేవుళ్లు అని ఎన్టీఆర్ చెప్పిన నినాదం అందరి తెలుగు వారిలో పాతుకు పోయింది. సుస్థిర స్థానం ద‌క్కించుకుంది. అదేవిధంగా ఎన్టీఆర్ హ‌యాంలో తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌లు కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి.


బీసీ నేత‌ల‌ను ప్రోత్స‌హించిన సీఎంగా ఎన్టీఆర్ నిలిచిపోతారు.
త‌ప్పిదాలున్నా కూడా ఎన్టీఆర్ పాల‌న త‌రువాత చంద్ర‌బాబు పాల‌న మ‌రింతగా ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకుపోయింది. హైటెక్ సీఎంగా పేరు తెచ్చుకున్న చంద్ర‌బాబు త‌న ప్రేమ‌నంతా హైద్రాబాద్ పైనే పెంచుకున్నారు. హైటెక్ సిటీ నిర్మాణానికి పూనుకున్నారు. అంతేకాదు పాల‌న‌కు సంబంధించి సంస్క‌ర‌ణ‌లు కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి. జ‌న్మ‌భూమి, ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న త‌దిత‌ర కార్య‌క్ర‌మా ల్లో బాబు మార్కు కొట్టేయ‌లేం. అంతేకాదు చాలా ప‌థ‌కాలు బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల కోస‌మే తీసుకువ‌చ్చారు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా రాష్ట్రం విడిపోయాక పార్టీ పూర్తిగా ఉప ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. తెలంగాణ‌పై పూర్తిగా ప‌ట్టుకోల్పోయింది. అంతేకాదు ఉన్న కాస్తో కూస్తో పేరు కూడా పోగొట్టుకుంది. టీడీపీ త‌ర‌ఫున ప‌నిచేసిన వారంతా ఇప్పుడు త‌లోదిక్కుకు వెళ్లిపోయారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణలో తెలుగుదేశం ఉన్నట్టా లేన‌ట్టా అన్న సంశ‌యాలు తలెత్తుతున్నాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విష‌య‌మై పార్టీ అధ్యక్షులు చంద్ర‌బాబు నాయుడు ఏ నిర్ణ‌యం తీసుకుని ప్ర‌జ‌ల ముందుకు వెళ్తారో అన్న‌ది ఆస‌క్తిదాయ‌కం అయింది. ఎలానూ త‌న శిష్యుడు రేవంత్ రెడ్డి టీపీసీసీలో ఉన్నారు క‌నుక కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో టీడీపీ ఏమ‌యినా నాలుగు, ఐదు స్థానాలు గెలుచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుందా అన్న‌ది కూడా వేచి చూడాలి. ముఖ్యంగా పార్టీకి న‌గ‌రంలో మంచి ప‌ట్టే ఉండేది. చంద్ర‌బాబు సొంత సామాజిక‌వ‌ర్గం మ‌నుషులంతా పార్టీ ప‌రిస్థితి బాగుండ‌క పోవ‌డంతో టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. నామా నాగేశ్వ‌ర‌రావు టీఆర్ఎస్ కు వెళ్లిపోయారు. తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు టీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధం అయిపోతున్నారు. ఇంకా ఇంకొంద‌రు చెట్టుకొక‌రు, పుట్ట‌కొక‌రు మాదిరిగా ఉండిపోయారు. దీంతో ఎన్టీఆర్ భ‌వ‌న్ ను ప‌ల‌క‌రించే నాయ‌కుడే కొర‌వ‌డ్డారు. ఒక‌ప్పుడు నామ‌, తుమ్మ‌ల లాంటి నాయ‌కులు టీడీపీకి పట్టుగొమ్మ‌ల్లా ఉండేవారు. దేవేంద‌ర్ గౌడ్, రేవంత్ లాంటి నేత‌లు అధినేత మాట‌కు విలువ ఇచ్చి ప‌నిచేశారు. పార్టీపై  మంచి ప‌ట్టున్న మైనార్టీ నేత‌లు కూడా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఇలా ఒక్కొక్క‌రూ ఎవ‌రి దారి వారు చూసుకుని చంద్ర‌బాబు ను ఒంట‌రి చేశారు. ఆయ‌న కూడా రాష్ట్రం విడిపోయాక తెలంగాణ వైపు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఎల్.ర‌మ‌ణ‌కు బాధ్య‌త‌లు ఇచ్చినా ఆయ‌న కూడా వాటిని వ‌దిలి గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ త‌రుణంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం ఇక్క‌డి నుంచి పోటీ చేస్తుందా లేదా అన్న‌ది పెద్ద సంశ‌యం.


మరింత సమాచారం తెలుసుకోండి: