జమ్ము కశ్మీర్‌లో ఉగ్రమూకలు మళ్లీ మళ్లీ రెచ్చిపోతున్నారు. ఇప్పటికే స్థానికేతరులను టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు... దాదాపు పది రోజుల్లో 15 మంది వరకు స్థానికేతరులను హత్య చేశారు. కొన్ని ప్రదేశాల్లో బహిరంగంగానే కాల్పులు జరిపి... అందరినీ భయపెట్టారు కూడా. దీంతో ఇప్పటికే కశ్మీర్ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రత్యేక నిఘా బృందాలతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టిస్తోంది. ఇక పొరుగున్న పాకిస్థాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందనే అనుమానంతో... అంతర్జాతీయ వేదిక ఐక్య రాజ్య సమితిలో కూడా పాకిస్థాన్ చర్యలను బహిరంగ పరిచింది. అయినా సరే... దాయాది దేశానికి మాత్రం బుద్ది రాలేదు. ఇప్పటికే తీవ్రవాదులను రహస్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి అక్రమంగా భారత్‌ భూభాగంలోకి చొప్పిస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు డ్రోన్ దాడులు చేస్తున్నప్పటికీ.. భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత... కశ్మీర్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. స్థానికేతరలు ఎక్కువగా కశ్మీర్‌లో నివాసం ఉండటం ప్రస్తుతం ఉగ్రవాదులకు సహించటం లేదు.

ఇప్పటికే స్థానికేతరులను టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు... అవకాశం దొరికినప్పుడల్లా కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా మరో ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. దీంతో పరిస్థితి చెయ్యి దాటిపోక ముందే పరిస్థితి చక్కబెట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. శ్రీనగర్‌లో పరిస్థితులపై అత్యవసర నివేదిక అందించాలని ప్రత్యేక నిఘా బృందాన్ని నియమించింది కేంద్రం. 24 గంటల్లో పూర్తిస్థాయి వివరాలతో సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించింది. అసలు హత్యల వెనుక కారణం ఏమిటీ.... ఉగ్రమూకల లక్ష్యం ఏమిటీ... ఇవి తీవ్రవాదుల కుట్రా... లేక రాజకీయ పార్టీలు చేస్తున్న దాడులా అనే కోణంలో విచారిస్తోంది కేంద్ర హోం శాఖ. అసలు స్థానికేతరులను టార్గెట్ చేస్తున్న వారు ఎవరూ... వాళ్ల వెనక ఉన్నది ఎవరూ అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది కేంద్రం. కశ్మీర్‌లో పరిస్థితిని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: