తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన దళితబంధు పథకం ఒక యజ్ఞమని అన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అత్యధికంగా దళితులే ఉన్నారని వారిని పైకి తెచ్చేందుకే ఈ ప్రయత్నమన్నారు. ఈ యజ్ఞం ఆగదనీ.. బీసీలు, ఈబీసీలకు వర్తింపజేస్తామన్నారు. ప్రాణం పోయినా దళితబంధు ఆపేదిలేదంటున్నారు. అద్భుతాలు జరుగుతాయన్న కేసీఆర్.. ఈ పథకం కోసం లక్షా 70వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. దీంతో రాష్ట్రానికి 10లక్షల కోట్లు వస్తుందన్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ఎంతో కష్టపడ్డామని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలోని రాజకీయ నేతలను ఎన్నో సార్లు కలిశామన్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతిని 19సార్లు కలిశానని అన్నారు. ఆమె తనతో మర్యాదగా.. ప్రేమగా మాట్లాడేవారని చెప్పారు. తెలంగాణ బాధలు చెబితే ఆమె కూడా మద్ధతు ఇచ్చారని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రం సాధించాక ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నామని వివరించారు.

మరోవైపు కళ్యాణలక్ష్మి పథకంపై ముఖ్యమంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ పథకంతో ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందిస్తుంటే.. పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకునేవాళ్లు కేసీఆర్ లక్ష ఇస్తుండు.. నువ్వెంత ఇస్తవ్ చెప్పు? అని అడుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారి దవడ పగలగొట్టమని సలహా ఇచ్చినట్టు చెప్పారు. పేదలకు పెళ్లి వల్ల అప్పులై ఇబ్బంది రావొద్దని తాము పథకం తెస్తే.. ఇలా అడగడమేంటని ప్రశ్నించారు.

ఇక ఆదివారం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సమావేశమైన పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సారి ముందస్తుకు వెళ్లడం లేదని చెప్పిన ఆయన.. రానున్న రెండేళ్లలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని కామెంట్ చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని స్థానాలు గెలిచేలా పనిచేద్దామని దిశానిర్దేశం చేశారు. ఇక హుజూరాబాద్ ఉపఎన్నికలో గులాబీ జెండానే ఎగురుతుందని పార్టీ నేతలతో అన్నారు. త్వరలో బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. చూద్దాం.. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో.








మరింత సమాచారం తెలుసుకోండి: