హుజూరాబాద్ ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను చిత్తుగా ఓడించాలని మంత్రి హరీశ్ రావు ఓటర్లకు పిలుపునిచ్చారు. కారులో ఎక్కించే టీఆర్ఎస్ కు ఓటేద్దామా..? కారుతో తొక్కించే బీజేపీకి ఓటేద్దామా..? ధరలు పెంచే బీజేపీని గెలిపిద్దామా..?  పేదలను కడుపులో పెట్టుకొని చూసుకునే టీఆర్ఎస్ ను గెలిపిద్దామా..? అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటేస్తే సిలిండర్ ధర పెంచడాన్ని సమర్థించినట్టేననని హరీశ్ రావు అన్నారు.

హుజూరాబాద్ ఉపఎన్నికలో హరీశ్ రావు మంత్రి హోదాలో ప్రచారం చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి అన్నారు. మంత్రి హోదాలో నెల రోజులకు పైగా ప్రచారం నిర్వహించడం అక్కడి ఓటర్లను, ఎన్నిక నిర్వహణను ప్రభావితం చేయడమే అవుతుందని విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ కు హరిశ్ రావుపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.

మరోవైపు కేసీఆర్ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ జోస్యం చెప్పారు. దీంతో 2022 ఆగస్ట్ లో గుజరాత్ తో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎవరూ అడగకముందే ముందస్తు ఎన్నికల చర్చను కేసీఆర్ ఎందుకు తెరపైకి తెచ్చారో సమాధానం చెప్పాలన్నారు. అటు హరీశ్ రావును ఇంటికి పంపేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నారనీ.. మంత్రికి చివరకు మిగిలేది మిత్రద్రోహి టైటిల్ మాత్రమేనని రేవంత్ చెప్పుకొచ్చారు.

ఇక కేసీఆర్ పై బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సీఎం కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యమంత్రి మౌనం ఒక తరాన్ని కూలీలుగా మార్చే కుట్ర అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ గురుకులాలు ప్రారంభించకపోవడమే అందుకు కారణమని అన్నారు. దీంతో విద్యార్థులు భూస్వాముల ఇళ్లు, భూముల్లో కూలీలుగా మారే ప్రమాదముందని కేసీఆర్ హెచ్చరించారు. గడీల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని ఆయన అన్నారు.మొత్తానికి హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం పదునైన విమర్శలతో వేడి పెంచుతోంది.

 




మరింత సమాచారం తెలుసుకోండి: