ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు కూడా సకాలంలో అందించలేని పరిస్థితి నెలకొంది. దసరా పండుగ అయిపోవడం, పండుగకు వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు కూడా తిరిగి వెళ్లిపోవడం జరిగింది. కానీ తమకు పెన్షన్లు  మాత్రం ఇంకా పడలేదని విశ్వవిద్యాలయాలలో పని చేసి పదవీ విరమణ చేసిన అధ్యాపకులు, సిబ్బంది, రాష్ట్రంలో కొన్ని శాఖలలో పని చేసి పదవీ విరమణ చేసిన వారు వాపోతున్నారు. ఈనెల 18వ తేదీ వరకు కూడా పెన్షన్లు అకౌంట్లలోకి జమ కాలేదని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు దాచిపెడుతున్నారు. అందరికీ పెన్షన్లు ఇచ్చామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు చాలా మంది తమకు పెన్షన్లు అందలేదని ఆందోళన చెందుతున్నారు. ఆసరా వంటి సంక్షేమ పథకాలకు నిధులు మళ్లించడంతోనే.. ఈ పరిస్థితి వచ్చిందనే చర్చ జరుగుతోంది..!

రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాల కింద రూ. 4 వేల కోట్లు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ల కింద రూ. 1500 కోట్లు ప్రతినెలా ఒకటో తేదీన ఇవ్వాల్సి ఉంది. సాధారణంగా 31న లేదా 1వ తేదీ సాయంత్రానికల్లా వేతనాలు, పెన్షన్లు అకౌంట్లలో పడాలి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు, వేతనాలు సకాలంలో పడటం లేదు. ప్రతినెలా ఉద్యోగులకు వేతనాలు పదో తేదీ నాటికి పూర్తిస్థాయిలో అందిస్తున్నారు.  పెన్షనర్లకు మాత్రం 20వ తేదీ వరకూ దశల వారీగా ఇస్తున్నారు. వృద్దాప్యంలో ఆరోగ్య సమస్యలు, ఇతర అవసరాల కోసం పెన్షన్ డబ్బులే ఉపయోగించుకుంటారు. కానీ పెన్షన్ డబ్బులు  సకాలంలో అందక రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..!

పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్లు ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో చెల్లించే  అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఆసరా పథకానికి ప్రభుత్వం ఇప్పటికే డబ్బులు వెచ్చించింది. సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ శాఖల ద్వారా వచ్చే ఆదాయం.. మంగళవారం రిజర్వ్ బ్యాంకు దగ్గర సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి ..అప్పు తెచ్చుకునే వెసులుబాటు మరో రూ.1500 కోట్లకు ఉంది. దీంతో మంగళవారం సాయంత్రానికి పూర్తిస్థాయిలో పెన్షన్లు చెల్లించే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: