ఏపీలో రోడ్ల దుస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో రహదారులు మరింత అధ్వాన్నంగా తయారయ్యాయి. పలు చోట్ల గుంతలు ఉండటంతో వర్షపు నీరు అందులో నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. అంతేకాదు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఏపీలోని పలు నగరాల్లో రోడ్లు గుంతలమయంగా ఉండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పది నిమిషాల్లో ఉండే ప్రయాణం కాస్తా.. అరంగంటకు పైగా పడుతోంది. ట్రాఫిక్ జామ్ కూడా తలెత్తుతోంది. దీంతో వాహనదారులు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. రోడ్ల దుస్థితి గురించి ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. దీనికి స్పందించిన జగన్ సర్కార్.. అదంతా గత ప్రభుత్వ తీరు వల్లే జరిగిందంటోంది. ప్రతిపక్షాల తీరుపై మండిపడుతోంది. అక్టోబర్ 2న జనసేన చేపట్టిన శ్రమదానం కార్యక్రమంపై కూడా విమర్శలు సంధించింది. వర్షాలు తగ్గగానే రోడ్లను అద్దాల్లా తయారు చేస్తామని చెబుతోంది. ఇప్పుడు రోడ్లు వేసినా ప్రయోజనం ఉండదంటోంది ఏపీ సర్కార్.

ఇదిలా ఉంటే కృష్ణా జిల్లాలోని గుడివాడ ప్రజలు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. రోడ్ల దుస్థితిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు సంధిస్తున్నారు. గ్రామాల్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయనీ.. దీనికి ఏం సమాధానం చెబుతారని రుద్రపాక గ్రామస్థులు అన్నట్టు సమాచారం. నమ్మి నాలుగు సార్లు గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చినా ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి రోడ్లపై రాకపోకలు సాగించాలంటే.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడివాడ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రిని కోరుతున్నారు.


చూద్దాం,... మంత్రి కొడాలి నాని గుడివాడ ప్రజలకు ఏం సమాధానం చెబుతారో. రోడ్లను ఎప్పుడు బాగు చేస్తారో. ప్రజల నుండి వచ్చే విమర్శలకు ఆయన ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.

 




మరింత సమాచారం తెలుసుకోండి: