టీఆర్‌ఎస్‌ నుంచి హరీశ్ రావు బయటకు వచ్చేస్తారా..? ఈ ప్రశ్న, అనుమానం ఇవ్పటివి కాదు.. ఎన్నో ఏళ్లుగా పార్టీలో జరిగిన చర్చ ఇది. అయితే ఈటల రాజేందర్‌ ఎపిసోడ్ తర్వాత ఈ ప్రచారానికి కాస్త జోరు తగ్గింది. టీఆర్‌ఎస్‌ లో కేసీఆర్ తర్వాత నెంబర్‌ టూ స్థానంలో మొదట్లో హరీశ్ రావే ఉండేవారు. ఈ స్థానాన్ని ఆయన చాలా కాలం ఆక్రమించి ఉన్నారు. ఆ తర్వాత కేటీఆర్ రాకతో సీన్ మారిపోయింది. పార్టీ లో తన తర్వాత ప్రాధాన్యత కొడుకు కేటీఆర్‌ కే ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్న తర్వాత పార్టీలో హరీశ్‌ రావుకు ప్రాధాన్యం తగ్గిపోయింది.


ఒక దశలో హరీశ్ రావును మంత్రి వర్గంలోకి కూడా తీసుకోకుండా ఖాళీగా ఉంచారు కేసీఆర్. ఆ తర్వాత ఏమనుకున్నారో.. మళ్లీ మంత్రి పదవి ఇచ్చారు. అయితే కేటీఆర్‌ కు పార్టీ పగ్గాలు అప్పగించాక కేసీఆర్, హరీశ్ మధ్య దూరం ఇంకాస్త పెరిగింది. అయితే కేసీఆర్‌ను ఎదిరించి పార్టీలో మనగలిగే అవకాశం లేక.. ఇతర పార్టీల్లో చేరే ఉద్దేశం లేక హరీశ్ రావు అన్నీ భరిస్తూ వస్తున్నారు. అయితే ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి అనూహ్యంగా పంపిన తర్వాత మరోసారి హరీశ్ రావు కేసీఆర్‌ కు దగ్గరయ్యారు. కేసీఆర్‌తో సన్నిహితంగా మెలుగుతున్నారు. కేసీఆర్ కూడా ఏమీ జరగనట్టే మళ్లీ హరీశ్ రావుకు ప్రాధాన్యం పెంచారు.


అయితే.. ఇదంతా తాత్కాలికమేనని.. త్వరలో హరీశ్‌ రావును కేసీఆర్ బయటకు పంపుతారని అంటున్నారు పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందని రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. పార్టీలో తిరుగుబాటును ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్‌ వరుసగా భేటీలు ఏర్పాటు చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. చివరకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మిత్ర ద్రోహిగా మిగిలిపోవడం ఖాయం అని రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. హరీశ్‌రావును పూర్తిగా ఇంటికి పంపించే ప్రణాళిక కేసీఆర్ సిద్ధం చేశారంటున్న రేవంత్ రెడ్డి.. మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని రెండేళ్ల ముందే కేసీఆర్ ఎలా చెప్తారని ప్రశ్నిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి రొటీన్‌గా ఈ విమర్శ చేశారా.. లేక ఏదైనా బలమైన సోర్స్ ఉండి ఉంటుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: