నాన్న ఓ శిఖ‌రం..వైఎస్ అన్న పేరు ఓ శిఖ‌రం.. ఆయ‌న బిడ్డ‌లు ఇప్పుడిప్పుడే రాజ‌కీయంలో ఎదుగుతున్నారు. ఆ శిఖ‌రం చెంత చాలా చిన్న చిన్న మొల‌కలు ఆ ఇద్ద‌రూ.. జ‌గ‌న్ కానీ ష‌ర్మిల కానీ ఇవాళ నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా రాజ‌కీయం చేస్తాం అంటే కుద‌ర‌ని ప‌ని. అన్న జ‌గ‌న్ మాదిరిగానే ష‌ర్మిల కూడా  ఉచిత ప‌థ‌కాలు ఇబ్బ‌డిముబ్బ‌డిగా ప్ర‌క‌టిస్తే మాత్రం ఇక చెప్పేదేం ఉండ‌దు.. అందుక‌ని కాస్త ఆలోచించి హామీలు ఇవ్వండి ష‌ర్మిల గారూ!


పాద‌యాత్ర‌లు చేస్తే సీఎంలు కారు అన్నా .. ప్ర‌జ‌లు ఓటేస్తే సీఎంలు అవుతారు.. ఇదీ ఆ రోజు వైఎస్ కుమార్తె ష‌ర్మిల ఇచ్చిన స్టేట్మెంట్. ఆ మాట‌లు ఎలా ఉన్నా రాజ‌కీయంలో స్థిరంగా నిల‌దొక్కుకుని మంచి పేరు తెచ్చుకోవాలంటే ప్ర‌జల మ‌ధ్యే ఉండాల‌న్న వైఎస్ చెప్పిన మాట‌కు ప్ర‌తి రూపంగా ష‌ర్మిల రేప‌టి నుంచి త‌న ప్ర‌యాణం మొదలుపెట్ట‌నున్నారు. ఆ రోజు వైఎస్ త‌న పాద‌యాత్ర‌తో చ‌రిత్ర లిఖించారు. క‌ష్టం ఓర్చి న‌డిచారు. క‌న్నీళ్లు తుడిచి న‌డిచారు. పేద‌లకు ఏం కావాలో తెలుసుకుని తానొక మారిన మ‌నిషి అని నిరూపించారు. అంత‌టి స్థాయి ష‌ర్మిల‌కు వ‌స్తుందా?


వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టి నుంచే ప్రిపేర్ అవుతున్నారు వైఎస్సార్ కుమార్తె ష‌ర్మిల. త‌న తండ్రి కి ఎంతో క‌లిసివ‌చ్చిన పాద‌యాత్ర‌నే గ‌తంలోనూ ఆమె ఎంచుకున్నారు. చేవెళ్ల మొద‌లుకుని ఇచ్ఛాపురం వ‌ర‌కూ ఆ రోజు న‌డిచి అన్న‌కు అండ‌గా నిలిచారు. కానీ ఆ రోజు తాను అంత చేసినా కూడా జ‌గ‌న‌న్న త‌న‌ను మ‌రిచిపోయాడ‌న్న ఆవేద‌న‌తో తానున్నాన‌ని కూడా చెప్పారు. ఇప్పుడు మ‌ళ్లీ సొంతంగా ఒక పార్టీ స్థాపించి., విధి విధానాలు ఖ‌రారు చేసి ష‌ర్మిల ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించారు. ముఖ్యంగా తెలంగాణ అంత‌టా ఆమె న‌డ‌క సాగ‌నుంది. వివిధ సంద‌ర్భాల్లో ప్ర‌జ‌ల‌తో ఆమె మాట్లాడి స్థానిక స‌మ‌స్య‌ల తీవ్ర‌త‌ను గుర్తించే ప్ర‌య‌త్నం ఒక‌టి ఆమె చేయ‌నున్నారు.

రేప‌టి నుంచి ష‌ర్మిల పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం దిద్ద‌నున్నారు. త‌మకు బాగా క‌లిసి వ‌చ్చిన చేవెళ్ల నుంచి ఆమె పాద‌యాత్ర ప్రారంభించ నున్నారు. ఈ త‌రం యువ‌త‌కు న‌వ‌త‌రం నాయ‌క‌త్వం అనే నినాదంతో ఆమె పాద‌యాత్ర చేయ‌నున్నారు. నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై ఇప్ప‌టికే ప్ర‌తి మంగ‌ళ‌వారి దీక్ష‌లు చేస్తున్న ష‌ర్మిల పాద‌యాత్ర‌లోనూ వారి స‌మ‌స్య‌ల‌పై త‌న ప్ర‌సంగాల ద్వారా  స్పందించ‌నున్నా రు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, అదేవిధంగా ఇత‌ర వ‌ర్గాలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించి కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని పాద‌యాత్ర సాగించ‌నున్నారు. నాన్న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చూపిన బాట‌లో తాను న‌డ‌వ‌నున్నాన‌ని ష‌ర్మిల ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. నాన్న ప్ర‌క‌టించిన సంక్షేమ ప‌థ‌కాల‌నే తాము అమ‌లు చేయనున్నామ‌ని, రాజ‌న్న రాజ్య స్థాప‌నే త‌న ధ్యేయ‌మ‌ని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: