అధికారం ఉన్నా లేక‌పోయినా జ‌నం స‌మ‌స్య‌ల‌పై మాట్లాడే వాడే నాయ‌కుడు. పోరాడే వాడే నాయ‌కుడు. టీడీపీలో ఉన్న నిరాశ కార‌ణంగా వైసీపీ ఇంకొంత బ‌ల‌ప‌డిపోయింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆర్థిక బ‌లం ఉన్న‌వారే త‌ల‌ప‌డేందుకు సిద్ధం అవుతున్నారు కానీ అర్థ బ‌లం లేని వారంతా సైడ్ అయిపోవాల‌ని ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. బాబు నుంచి ఎవ్వ‌రికీ ఎటువంటి హామీలు  లేవు. ప‌ని చేయండి చాలు ప‌ద‌వుల సంగ‌తి త‌రువాత అని చెబుతున్నారే కానీ స్ప‌ష్ట‌మ‌యిన హామీ ఏదీ ఇవ్వ‌లేక‌పోతున్నారు. దీంతో ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం ప‌నిచేసిన వారంతా నిరాశ‌లో ఉన్నారు.


వైసీపీ పాల‌న బాగున్నా, బాగుండ‌క‌పోయినా ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేందుకు చాలా అప్పులు చేసి మ‌రీ! ఏదో ఒక విధంగా జ‌నాల‌ను సంతృప్త ప‌రిచేందుకు ఆప‌సోపాలూ ప‌డుతోంది. కానీ టీడీపీ మాత్రం ఇంకా పుంజుకోలేదు. ఓట‌మి నుంచి ఇంకా కోలుకోలేదు. ఓట‌మి నుంచి కోలుకుని గెలుపును సాధించే దిశ‌గా ప‌రుగులు తీయ‌డం మానుకుంది. ప‌దే ప‌దే పార్టీ ప‌ద‌వుల్లోనూ న‌మ్మిన బంటుల‌కు అన్యాయం అవుతుండ‌డంతో కొంద‌రు అసంతృప్తితో ఉన్నారు. కొంద‌రు పార్టీ వీడిపోయేందుకు కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అలా అని వైసీపీ వ‌ల‌స‌ల‌ను  ఇప్ప‌టికిప్పుడు ప్రోత్స‌హించ‌డం లేదు. బాగా పేరున్న నాయ‌కులనే ఆగ‌మ‌ని చెబుతోంది. దిగువ స్థాయి నాయ‌కులు పార్టీలో చేరినా ప‌ద‌వుల‌పై ఆశే వ‌ద్ద‌ని హితువు చెబుతున్నాడు జ‌గ‌న్. అందుక‌నో ఎందుక‌నో టీడీపీ క్యాడ‌ర్ ఇంకా డైలామాలోకి పోతోంది. అచ్చెన్న లాంటి లీడ‌ర్లు మాట్లాడినా, వైసీపీ అటాక్ తీవ్రంగా ఉంటోంది. దీంతో త‌న‌కెందుకు వ‌చ్చిన గొడ‌వ అని చాలా సంద‌ర్భాల్లో ఆయ‌న సైలెంట్ అయిపోతున్నారు. మిగ‌తా నాయ‌కులు
ప్రెస్మీట్లు పెట్టినా అంత స‌మ‌ర్థంగా ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు చేయ‌లేక చ‌తికిల‌ప‌డిపోతున్నారు.



చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఏర్పాట్లలో ఉన్నారు. ముంద‌స్తు వ‌చ్చినా కూడా నెగ్గేందుకు త‌న వ్యూహాలు తాను ర‌చిస్తూ ఉన్నారు. ఇవి ఎవ్వ‌రికి రుచించినా, రుచించ‌క‌పోయినా త‌న ప‌ని తాను చేసుకుని పోతున్నారు. కానీ వైసీపీ మాత్రం చంద్ర‌బాబు క‌న్నా చాలా వేగంగా దూసుకుపోతోంది. బ‌ల‌మైన ఆర్థిక మూలాలున్న నేత‌లంతా త‌మ ప‌ని తాము చేసుకుపోయేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. టీడీపీకి క్షేత్ర స్థాయిలో క్యాడ‌ర్ ఉన్నా, ఇప్ప‌టికీ నాయ‌క‌త్వ లేమి వేధిస్తోంది. గతంలో మాదిరిగా పార్టీ జెండా మోసిన వారెవ్వ‌రూ ఇటుగా రావ‌డం లేదు. ఒక‌ప్పుడు పార్టీ పిలుపుతో ప‌నులు మానుకుని ప‌నిచేసిన వారంతా ఇప్పుడు అస్స‌లు జిల్లా కార్యాల‌యాల వైపు చూడ‌డ‌మే మానుకున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు పార్టీ అధిష్టానం త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతోనే తాము ఇలా త‌యార‌య్యామ‌ని కూడా వీరంతా అంటున్నారు. బాబు కానీ చిన బాబు కానీ ఎవ్వ‌రూ త‌మ క‌ష్టాల‌ను విని ప‌రిష్క‌రించిన దాఖ‌లాలే లేవ‌ని వాపోతున్నారు. ఈ ద‌శలో టీడీపీ త‌న సత్తా చాట‌డం ఖాయ‌మేనా?

మరింత సమాచారం తెలుసుకోండి: