బద్వేల్ ఉపఎన్నికల పోటీ నుంచి జనసేన పార్టీ తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో అప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఉప ఎన్నికల్లో కాస్త వేడి తగ్గింది. కేవలం బీజేపీ, వైసీపీ మధ్యనే ప్రధానంగా పోరు నడుస్తోంది. టీడీపీ కూడా జనసేన బాటలోనే పోటీనుంచి వ్యూహాత్మకంగా తప్పుకుంది. అయితే బయటనుంచి జనసేన పార్టీ నేతలు కొందరు బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. బీజేపీని గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొందరు టీడీపీ నేతలు కూడా బీజేపీకే ఓటు వేయాలని తమ క్యాడర్ ను ఆదేశిస్తున్నారు.

బద్వేల్ ఉపఎన్నికల విషయంలో జనసేనాని వైఖరి మొదట్లో కఠినంగానే ఉంది. బద్వేల్ ఉపఎన్నికలలో పోటీచేసి.. తమ సత్తా చాటాలని పవన్ మొదట భావించారు. అయితే తెరవెనుక ఏం జరిగిందో తెలియదుగానీ.. సడెన్ గా పవన్ మాట మార్చారు. పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. దీంతో జనసేన పార్టీ నాయకుల్లో.. క్యాడర్ లో కాస్త ఉత్సాహం తగ్గింది. మిత్రపక్షమైన బీజేపీ మాత్రం పనతల సురేష్ ను అభ్యర్థిగా ప్రకటించింది. వైసీపీపై విమర్శలు సంధిస్తూ ప్రచారం కూడా చేస్తున్నారు బీజేపీ నేతలు. అయితే ఈ ప్రచార గడువు ముగుస్తుండటంతో పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించాలని కొందరు బీజేపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం.

బద్వేల్ ఉపఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా..? జనసేన పార్టీని పోటీలో లేకుండా చేసి..  బీజేపీని గెలిపించాలని ప్రచారం ఎందుకు చేస్తారన్నదే.. ఇప్పుడు అసలు ప్రశ్న. బీజేపీ నేతల ప్రచారం మాటెలా ఉన్నా.. పవన్ కళ్యాణ్ మాత్రం బద్వేల్ ఉపఎన్నికలలో ప్రచారం చేయడని, జనసేన వర్గాల సమాచారం. బద్వేల్ ఉప ఎన్నికల్లో జనసేన తమ తరపున ప్రచారం చేస్తుందని ఆమేరకు నాదెండ్ల మనోహర్ ప్రకటించారని సోము వీర్రాజు కూడా స్టేట్ మెంట్లిచ్చారు. అయితే ఆ తర్వాత ఎక్కడా జనసేన ముఖ్య నాయకులు ప్రచారం మాటెత్తలేదు. అంటే రేపు పవన్ కల్యాణ్ కూడా ప్రచారానికి వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. కనీసం పవన్ రాకపోయినా, పవన్ తరపున జనసైనికులకు ఓ పిలుపునిస్తారేమోనని బీజేపీ ఆశిస్తోంది. కనీసం ఆ ఆశలయినా నెరవేరతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: