ఏపీ సీఎం జగన్ విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీడీపీ నేత అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, పట్టాభి వంటి నేతలను అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టింది. వీరే కాదు.. ఇంకా చాలా మంది నాయకులు అరెస్టులు కావడం, విడుదల కావడం జరిగిపోయాయి. ఇక ఇప్పుడు  మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు వంతు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల నక్కా ఆనందబాబు రాష్ట్రంలో డ్రగ్‌ మాఫియా విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపణలు చేశారు.


విపక్షాలు అన్నాక విమర్శలు చేస్తూనే ఉంటాయి కదా.. అందుకే మరో అడుగు ముందుకేసి.. వైసీపీ ప్రభుత్వ పెద్దలే ఈ డ్రగ్‌ మాఫియా వెనుక ఉన్నారని ఆరోపించారు. అంతే కాదు.. ఇటీవల విశాఖ మన్యంలో కొందరు స్మగ్లర్లపై తెలంగాణ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ అంశంపైనా నక్కా ఆనందబాబు విమర్శలు చేశారు.  పనిలో పనిగా విజయసాయిరెడ్డిపైనా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇదే నక్కా ఆనంద్‌బాబు మెడకు చుట్టుకుంటోంది. ఏ ఆధారంతో ఆ ఆరోపణలు చేశారో చెప్పాలంటూ నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.


అయితే.. నోటీసులు ఇవ్వడానికి అర్థరాత్రి వేళ నక్కా ఆనందబాబు ఇంటికి పోలీసులు వెళ్లడం వివాదాస్పదం అవుతోంది. మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటికి విశాఖ పోలీసులు వెళ్లగా...  అర్థరాత్రి పూట నోటీసులేంటంటూ నక్కా ఆనంద్‌బాబు నోటీసులు తీసుకోలేదు. ఉదయం రమ్మని చెప్పారు. దీంతో మరోసారి నక్కా ఆనందబాబుకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


ఇక్కడ ఓ విషయం గమనించాలి. ఆధారాలు ఉంటేనే ఆరోపణలు చేయాలన్న కొత్త రూల్ మాత్రం సబబు కానే కాదు. ఇలాంటి రూల్స్ ఉంటే.. ఇక విపక్షాలు నోరు తెరిచి ప్రశ్నించే అధికారం కోల్పోతాయి. అయినా గతంలో జగన్ పార్టీ నేతలు ఆరోపణలు ఉంటేనే చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారా.. అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఆరోపణలు చేయడం సహజం. అవి అసమంజసంగా ఉంటే.. ప్రజలే వాటిని తిరస్కరిస్తారు. ఆ మాత్రం విజ్ఞత ప్రజలకు లేదనుకోవడం సరికాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: