మన తెలుగు ఇంజినీర్లు మరో గొప్ప ఆవిష్కరణ చేశారు. ఏకంగా ఆసియాలోనే అతి పెద్ద సొరంగాన్ని నిర్మించారు. ఏకంగా 49 కిలో మీటర్ల మేర సొరంగం ఏర్పాటు చేశారు. ఇంతకీ ఈ అతి పెద్ద సొరంగం ఎక్కడ అనుకుంటున్నారా.. అది తెలంగాణలో ఏర్పాటైంది. దేవాదుల ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఈ సొరంగం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది ఆసియాలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందుతోంది. ఈ సొరంగంలోకి వచ్చే ఏడాదిలో నీరు విడుదల చేస్తారు.


ఈ సొరంగం వివరాల్లోకి వెళ్తే.. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న జల సొరంగం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇందులో కీలకమైన 49.06 కిలోమీటర్ల  సొరంగం పూర్తయింది. దీన్ని  ఆసియాలోనే అతిపెద్ద జల సొరంగంగా చెబుతున్నారు. దేవాదులు అనేది ఎత్తిపోతల పథకం. ఈ పథకంలో రామప్ప చెరువు నుంచి ధర్మసాగర్‌ చెరువు వరకు 55 కి.మీ. పొడవున తవ్వాలని 13 ఏళ్ల క్రితం నిర్ణయించారు. 2008లో ఈ సొరంగం పనులు ప్రారంభించారు.


అయితే.. ఈ జల సొరంగం కారణంగా  రామప్ప ఆలయానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న వాదన వచ్చింది. కొందరు ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేశారు కూడా.. అందుకే చెరువు నుంచి 7 కిలోమీటర్ల దూరం పైపులైన్‌ను వేశారు. సొరంగాన్ని ములుగు జిల్లా జాకారం నుంచి హనుమకొండ జిల్లా దేవన్నపేట వరకు తవ్వాలని ప్లాన్ మార్చారు. ఈ సొరంగం తవ్వకం పనుల్లో అనేక అవరోధాలు ఏర్పడ్డాయి కూడా. పనులు ప్రారంభించిన మూడేళ్లకు అంటే.. 2011లో సొరంగం పనుల్లో బుంగ పడి ముగ్గురు మరణించారు. ఆ తర్వాత పనులకు బ్రేక్ వచ్చింది.


తెలంగాణ ఏర్పాటు తర్వాత ఐదేళ్ల క్రితం మళ్లీ పనులు మొదలయ్యాయి. మేఘా సంస్థ ఆ బాధ్యతలు చేపట్టింది. ఇక్కడి నేల సాఫ్ట్‌రాక్‌. అందువల్ల పనులు కాస్త క్లిష్టం అయ్యాయి. మొత్తానికి ఆరేళ్లలో పనులు పూర్తి చేశారు. లైనింగ్‌ పనులు ఇంకా చేయాల్సి ఉంది. అవి డిసెంబర్‌ నాటికి పూర్తి చేసేందుకు కృషి చేస్తామంటున్నారు. అవి పూర్తయితే వచ్చే ఏడాది జనవరిలోవెట్ రన్‌ నిర్వహిస్తారు. ఈ సొరంగం అందుబాటులోకి వస్తే ఏటా 50 టీఎంసీల గోదావరి జలాలు వాడుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: