భూతల స్వర్గం కేరళ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అసలు ఏం జరుగుతుందో కూడా ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రజలకు అర్థం కాని పరిస్థితి. క్షణక్షణం భయం భయం అన్నట్లుగా కాలం గడుపుతున్నారు. ప్రకృతి ప్రసాదంగా చెప్పుకునే కేరళపై... ఇప్పుడు అదే ప్రకృతి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు కేరళ రాష్ట్రం నిండా మునిగిపోయింది. వేల మంది నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు మళయాళీలు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పరస్తుతం వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. కొట్టాయం సహా 6 జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలోని నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అన్ని రిజర్వాయర్లు కూడా ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్రంలోని 11 డ్యామ్‌లకు అయితే... రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ. దిగువ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

భారీ వర్షాలకు కేరళలో ఇప్పటికే 40 మంది మృతి చెందారు. వందల మంది గల్లంతయ్యారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. పునరావాస కేంద్రాల్లో లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. కొండచరియలు విరిగి పడటంతో... ఇప్పటికే పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఇళ్లు నీట మునిగిపోయాయి. వరద నీటి కారణంగా గల్లంతైనా వారి కోసం ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి కారణంగా... మరో వారం రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలు ఇప్పటికే కేరళలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించాయి. కేరళలో ప్రధానమైన ఇడుక్కి డ్యామ్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. డ్యామ్ గేట్ల ద్వారా దిగువకు దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే దిగువ నున్న ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో... ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇప్పటికే అత్యవరస సమావేశం కూడా నిర్వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: